
కర్ణాటక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై కౌంటర్ ఇచ్చారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుందని బొమ్మై అన్నారు. తాను రాష్ట్ర ప్రజలకు విధేయుడిగా ఉంటానని బొమ్మై అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగని అనేక ప్రాజెక్టులను రాష్ట్రానికి అందించిన ప్రధాని మోడీ ‘కామధేనుడు’ (కోరికలు తీర్చే ఆవు) లాంటివాడని బొమ్మై పేర్కొన్నారు.
15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో కర్నాటకకు రూ. 5,495 కోట్లను స్పెషల్ అలవెన్స్ నిధులను సిఫార్సు చేసిందని అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం వాటిని ఇవ్వలేదని సిద్ధరామయ్య ఆరోపించారు. దీనిపై మోడీ ముందు ప్రస్తావించడానికి సీఎంతో పాటుగా ఇతర నేతలకు దమ్ములేదని సిద్ధరామయ్య అన్నారు. దీనిపై బొమ్మై స్పందిస్తూ మరో నాలుగు నెలల సమయం ఉన్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.