వివాదానికి దారితీసిన కర్ణాటక ప్రభుత్వ యాడ్

వివాదానికి దారితీసిన కర్ణాటక ప్రభుత్వ యాడ్

కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన ఓ యాడ్ వివాదానికి దారితీసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కు సంబంధించి ప్రభుత్వం ఓ యాడ్ను అన్ని న్యూస్ పేపర్స్లో వేయించింది. ఈ యాడ్లో పలువురు స్వాతంత్య్ర సమరయోధులు ఉండగా..అందులో నెహ్రూ ఫొటో లేదు. అందులో ఆర్ఎస్ఎస్ కు చెందిన వినాయక్ సావర్కర్ ఫొటో ఉంది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. అయితే తాము కావాలనే నెహ్రూ ఫొటోను పెట్టలేదని బీజేపీ తెలిపింది. 

దేశాన్ని ఇండియా, పాకిస్థాన్ గా విడగొట్టినందుకు నెహ్రూ ఫొటో పెట్టలేదని బీజేపీ అధికార ప్రతినిధి రవి కుమార్ తెలిపారు. సర్ధార్ వల్లాభాయ్ పటేల్ స్వాతంత్ర్యం కోసం పోరాడారని.. అందుకే ఆయన ఫొటో పెట్టామన్నారు. ఆయనలాగే గాంధీ, ఝాన్సీరాణి, సావర్కర్ కూడా దేశం కోసం పోరాటం చేశారన్నారు. నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడారని..అయితే దేశాన్ని విడగొట్టాడని ఆరోపించారు. 

కాగా ఇది రాజకీయ కుట్రలో భాగమని కాంగ్రెస్ విమర్శించింది. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తన కుర్చీ కోసం ఎంతవరకైన దిగజారేలా ఉన్నాడని జైరాం రమేష్ మండిపడ్డారు. బొమ్మై తండ్రి ఎస్ఆర్ బొమ్మై, అతని గురువు ఎంఎన్ రాయ్లు నెహ్రూ ఆరాధకులని..ఈ ప్రకటనతో బొమ్మై వారిని కూడా అవమానించినట్లేనని జైరాం రమేష్ ఆరోపించారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని డీకే శివకుమార్ అన్నారు. ప్రధాని మోడీ సీఎం బొమ్మైను వెంటనే బర్తరఫ్ చేయాలన్న ఆయన బొమ్మై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.   

బ్రిటీష్ వారితోనే బానిసత్వం పోయిందని తాము అనుకున్నామని..కానీ అది తప్పని సీఎం బొమ్మై నిరూపించారని మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఆయన ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ బానిస అంటూ ట్వీట్ చేశారు.