కర్ణాటకలో ఘోరం: భార్యను జుట్టు పట్టుకుని ఈడ్చి.. కారుతో తొక్కిచ్చి చంపిన భర్త!

 కర్ణాటకలో ఘోరం: భార్యను జుట్టు పట్టుకుని ఈడ్చి.. కారుతో తొక్కిచ్చి చంపిన భర్త!

కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కళ్లముందే భార్యను కొడుతున్నా, కారుతో తొక్కిస్తున్నా ఎవరూ ఆపకపోవడం కలచివేస్తోంది. ఈ దారుణ దృశ్యాలన్నీ అక్కడే ఉన్నవారి ఫోన్లలో రికార్డయ్యాయి.

 సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే... మహారాష్ట్రలోని బారామతికి చెందిన అక్షయ్, సాన్వి (28) దంపతులకు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. గురువారం ఉదయం వీరిద్దరూ  ఎర్టిగా కారులో గంగాపుర పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. ఉదయం 11 గంటల సమయంలో బల్లూర్గ గ్రామం దగ్గరకు రాగానే భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన అక్షయ్ తన భార్యను కారులోంచి బయటకు తోసేశాడు.

కళ్లముందే దారుణం
కారులోంచి తోసాక రోడ్డు పక్కన భార్యను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ, అక్షయ్ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సాన్వి ప్రాధేయపడుతున్నా, అరుస్తున్నా వదలకుండా కొట్టాడు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఈ దృశ్యాలను ఫోన్లలో రికార్డ్ చేశారే తప్ప, అతడిని ఆపడానికి ప్రయత్నించలేదు. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు జోక్యం చేసుకుని, గొడవ సర్దిచెప్పి సాన్విని తిరిగి కారులోకి  ఎక్కించారు.

కారుతో తొక్కిచ్చి హత్య:
కారు స్టార్ట్ అయినా  కొద్ది నిమిషాలకే అక్షయ్ మళ్లీ పక్కనే ఉన్న పొలాల్లోకి కారు పోనిచ్చాడు. అక్కడ సాన్విని బలవంతంగా కిందకు తోసేసి, ఆమెపై నుంచి కారును పోనిచ్చి దారుణంగా హత్య చేశాడు. ఈ దృశ్యాలు కూడా కెమెరాలో రికార్డయ్యాయి.

భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే అక్షయ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.