మహిళా ఐఏఎస్ అధికారుల మధ్య గొడవ..

మహిళా ఐఏఎస్ అధికారుల మధ్య గొడవ..
  • ఈ వేధింపులు నేను భరించలేనంటూ మైసూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ శిల్పానాగ్‌ రాజీనామా  
  • మైసూరు జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరిపై ఆరోపణలు 

బెంగళూరు: కర్నాటకలో ఇద్దరు మహిళా ఐఎఎస్ ల మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కింది. స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేదు.. అనుక్షణం వేధింపులు భరించడం కంటే ఉద్యోగం వదులుకోవడమే ఉత్తమం.. అందుకే నేను నా సివిల్ సర్వెంట్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా.. నా రాజీనామాను వెంటనే ఆమోదించి నన్ను బాధ్యతల నుండి తప్పించండి అంటూ ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి రాజీనామా లేఖ పంపారు. ఈ విషయం నేరుగా మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఒకే జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు సర్వోన్నత అధికారులు ( ఐఏఎస్).. అందునా మహిళలు... ఇలా గొడవపడడం ఏంటి..? పనిచేసే చోట విభేదాలు సాధారణమే.. ఇంత అసాధారణ నిర్ణయాలేంటి..?  అసలు కర్నాటకలో ఏం జరుగుతోందంటూ ఆరాతీయడం ప్రారంభించారు. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా ఐఎఎస్... ప్రస్తుత మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి మన తెలుగమ్మాయి కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో హాట్ టాపిక్ అయింది. 
కలెక్టర్ సింధూరి పదేపదే అడ్డుపడుతూ వేధిస్తున్నారు: శిల్పా నాగ్

గత ఫిబ్రవరిలో మైసూరు కమిషనర్‌గా నియమితులైన 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి, మైసూరు మున్సిపల్ కమిషనర్ శిల్పా నాగ్ గురువారం ముఖ్యమైన ప్రెస్ మీట్ అంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. మైసూరులో స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు..  అందుకే నేను సివిల్‌ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.. అని ప్రకటించడం సంచలనం రేపింది. నిజమేనా.. నమ్మశక్యంగా లేదంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తుండగానే.. ఎస్.. అని తల ఊపుతూ సర్వీసులో తనకంటే ఆరేళ్లు సీనియర్ అయిన జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరి విధి నిర్వహణలో తనకు పదేపదే అడ్డుపడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని, నా విధులు నేను సరిగ్గానే చేస్తున్నానా లేదా అని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. రోజు రోజుకూ వేధింపులు పెరుగుతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదని శిల్పానాగ్‌ ఆరోపించారు. ఈమె 2014 బ్యాచ్ కర్నాటక కేడర్ ఐఎఎస్ అధికారిణి.  2009 బ్యాచ్ కర్నాటక కేడర్ ఐఏఎస్ అయిన రోహిణి సింధూరి తనను స్వేచ్ఛగా పని చేసుకోనివ్వడం లేదని, అడగడుగునా అడ్డు వస్తున్నారని, ఇలాంటి దురంహంకారం కలిగిన కలెక్టర్‌ ఎవరికీ వద్దని, తాను ఆమె పనితీరుతో విసిగిపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయడమే మంచిదనుకుంటున్నానని మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేయడం సంచలనం రేపింది.  
ఇద్దరు ఐఏఎస్‌ స్థాయి అధికారుల మధ్య ఇటువంటి వివాదం సరికాదని తాను మౌనం వహించేకొద్దీ ఇంకా ఎక్కువగా తనను టార్గెట్‌ చేయడంతో ఎంతో బాధపడ్డానని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశానని ఆమె తెలిపారు. చివరికి విసిగిపోయి ఇక్కడ పనిచేయడం కంటే ఉద్యోగానికి రాజీనామా చేసి బయటపడడమే ఉత్తమమని భావించి రాజీనామా చేసినట్లు చెప్పా రు. తాను జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరికి అన్నివిధాలా గౌరవం ఇ చ్చానని, కానీ తనపై ఆమెకు ఎందుకు పగ, కోపమో అర్థం కావడం లేదని అన్నారు. ఇద్దరు ఐఎఎస్ మహిళా అధికారుల మధ్య వివాదం హాట్ టాపిక్ కావడంతో ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.