
- ఇప్పటికే శ్రీశైలం అడుగు నుంచి దోచుకుపోతున్న ఏపీ
- తెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు.. మన ప్రాజెక్టులకు నీళ్లందని పరిస్థితి
- పోలవరం డైవర్షన్ కేటాయింపుల నిష్పత్తిలోనే ఇప్పుడూ కావాలంటున్న కర్నాటక, మహారాష్ట్ర
- 112 టీఎంసీలకు కర్నాటక డిమాండ్.. 74 టీఎంసీలకు మహారాష్ట్ర పట్టు
- ఇప్పటికే ఆల్మట్టి ఎత్తును 519.67 నుంచి 524.256 మీటర్లకు పెంచేలా కర్నాటక కసరత్తు
- కృష్ణా నీటితోపాటు గోదావరిపై ప్రాజెక్టులకు అవకాశం అడుగుతున్న మహారాష్ట్ర
- వైన్గంగపై గోస్ఖుర్ద్ ప్రాజెక్ట్ నిర్మాణానికి యోచన.. విదర్భకు 96 టీఎంసీలు తరలించే ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు:
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం– బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ తెలంగాణ జల ప్రయోజనాలకు తీవ్ర ముప్పుగా మారబోతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా లెక్కకు మించి నీటిని ఏపీ దోచుకెళ్తున్నది. అది చాలదన్నట్టు ఇప్పుడు బనకచర్ల పేరు చెప్పి.. మన ఎగువ రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర కూడా కృష్ణా నదిలో నిలువు దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఒకటికాదు.. రెండు కాదు.. 186 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును చూపించి కృష్ణా నీళ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీల నీటిని డెల్టాకు మళ్లిస్తుండడంతో.. ఆ మేరకు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు బచావత్ ట్రిబ్యునల్ 1978లో నీటి కేటాయింపులు జరిపింది. నాగార్జునసాగర్ ఎగువన 80 టీఎంసీల్లో ఏపీకి 45 టీఎంసీలు (56.25 శాతం), కర్నాటకకు 21 టీఎంసీలు (26.25 శాతం), మహారాష్ట్రకు 14 టీఎంసీలు (17.50 శాతం) ఇచ్చింది.
ఇప్పడు పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్, గోదావరి – కావేరి లింక్ ప్రాజెక్టుల నుంచి నీటి మళ్లింపులను చూపించి.. అదే నిష్పత్తిలో కృష్ణాలోని 186 టీఎంసీలను మళ్లించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు కర్నాటక, మహారాష్ట్ర డిమాండ్ పెట్టాయి. తమకు 112 టీఎంసీలు ఇవ్వాలని కర్నాటక తేల్చిచెప్తే.. తమకు 74 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని మహారాష్ట్ర స్పష్టం చేసింది. కేంద్రం ఒకవేళ బనకచర్ల ప్రాజెక్టుకు ఓకే చెప్తే ఆ మేరకు ఎగువ రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రకు నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పటికే నీళ్ల విషయంలో తీరని అన్యాయానికి గురైన తెలంగాణకు భవిష్యత్‌లో మరింత నష్టం తప్పేలా లేదు.
ఇదీ కర్నాటక డిమాండ్
కర్నాటకకు ఇప్పటికే పోలవరం డైవర్షన్ ద్వారా 21 టీఎంసీలు లభిస్తుండగా.. గోదావరి – కావేరి లింక్ ద్వారా తరలించే జలాల్లోనూ 26.25 టీఎంసీలు ఇవ్వాలని ఆ రాష్ట్రం పట్టుబడుతున్నది. గోదావరి – కావేరి లింక్‌తో ఏపీ అదనంగా 100 టీఎంసీలు తరలించుకుంటున్నదని, ఈవిషయాన్ని 2022 డిసెంబర్ 28న సీడబ్ల్యూసీ స్టడీ తేల్చిందని కేంద్రానికి స్పష్టం చేసింది. కాబట్టి ఆ జలాల్లోనూ నిష్పత్తి ప్రకారం 26.25 టీఎంసీలు ఇవ్వాలని కర్నాటక అంటున్నది.
ఇక, పోలవరం బనకచర్ల ప్రాజెక్టులో భాగంగా తరలించే 243 టీఎంసీల్లో అదే నిష్పత్తి ప్రకారం.. 64.75 టీఎంసీలు కావాలంటున్నది. మొత్తంగా 112 టీఎంసీల జలాలను కృష్ణాలో ఎగువన వాడుకుంటామని తేల్చిచెప్పింది. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తును పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఫేజ్ 3లో భాగంగా ఆల్మట్టి ఎత్తును 519.69 మీటర్ల నుంచి 524.256 మీటర్ల ఎత్తుకు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చేసింది.
అంటే దాదాపు ఐదు మీటర్ల ఎత్తును పెంచనుంది. ఆ మేరకు ఎత్తు పెంచితే నీళ్ల స్టోరేజీ కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. మరో ఐదు మీటర్ల ఎత్తు పెరిగితే అదనంగా మరో 100 టీఎంసీల స్టోరేజీ ఆల్మట్టిలో పెరుగుతుంది. మొత్తంగా 230 టీఎంసీల వరకు ఆల్మట్టిలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం కర్నాటకకు వస్తుంది. వరదలు, వానల్లేని రోజుల్లో ఆల్మట్టి ప్రాజెక్టు వల్ల మన ప్రాంతంలోని ప్రాజెక్టులకు నీళ్లు చాలా తక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఎత్తు పెంచితే.. మన ప్రాజెక్టులు నిండడం కలే అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
మహారాష్ట్రదీ అదే దారి..!
బనకచర్లను బూచి చూపించి మహారాష్ట్ర కూడా కృష్ణాలో నీటిని తరలించే ప్రయత్నాలకు తెరలేపింది. ఇప్పటికే పోలవరం డైవర్షన్ ద్వారా 14 టీఎంసీల వాటా మహారాష్ట్రకు దక్కగా.. ఇప్పుడు జీసీ లింక్‌లో ఏపీ తరలించుకునే వంద టీఎంసీల్లో 17.5 టీఎంసీలు, పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలించే 243 టీఎంసీల్లో 42.425 టీఎంసీల జలాలు కావాలని పట్టుబడుతున్నది. అంటే మూడు డైవర్షన్ల ద్వారా మహారాష్ట్ర 74 టీఎంసీల వాటా కోరుతున్నది.
అందుకు తగ్గట్టు ఎగువన తాము నిర్మించుకునే ప్రాజెక్టుల్లో వాడుకుంటామని స్పష్టం చేస్తున్నది. మరోవైపు ఇటు గోదావరిపైనా వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించుకునేందుకు డిమాండ్ చేస్తున్నది. తద్వారా కరువు ప్రాంతమైన విదర్భకు నీటిని తరలించుకుంటామని తేల్చిచెప్తున్నది. ఇప్పటికే వైన్‌గంగ(గోసిఖుర్డ్)– నల్‌గంగ (పూర్ణతాపి) లింక్ ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమవుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ విదర్భకు 96 టీఎంసీల జలాలను మళ్లించాలని భావిస్తున్నది. మొత్తంగా మహారాష్ట్ర ఇటు కృష్ణా నీళ్లతో పాటు గోదావరి నీళ్లనూ తీసుకెళ్తామని చెప్పకనే చెప్పింది.
వరద జలాల ప్రాజెక్టులే లేవ్..!
వాస్తవానికి దేశంలో వరద జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులేవీ లేవని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏ ప్రాజెక్టు చేపట్టినా నికర జలాల బేసిస్‌లోనే చేపట్టాల్సి ఉంటుందని, దాని ఆధారంగానే ప్రాజెక్టులకు కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ అయినా.. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డ్ అయినా నికర జలాల ఆధారంగా ఇచ్చినవే తప్ప వరద జలాలపై కాదని నిపుణులు అంటున్నారు. దేశంలోనూ ఎక్కడా వరద జలాల కాన్సెప్ట్‌తో ప్రాజెక్టులను కట్టిన దాఖలాలు లేవంటున్నారు.
అలాంటప్పుడు వరద జలాల ఆధారంగా ఏపీ చేపడుతున్న పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం సానుకూలత వ్యక్తంచేయడం విస్మయపరుస్తున్నది. తన మిత్రపక్షానికి మేలు చేసే దిశగానే కేంద్రంలోని బీజేపీ పావులు కదుపుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బనకచర్లకు వ్యతిరేకంగా తెలంగాణ తీవ్ర స్థాయిలో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేదంటే భవిష్యత్‌లో పెను నష్టం తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు.
తెలంగాణకు తీవ్ర నష్టం
ఏపీ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం అండ చూసుకుని బనకచర్ల ప్రాజెక్టును కట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. బనకచర్లను ఏపీ పూర్తి చేస్తే కృష్ణాలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల డిమాండ్లకు.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు నీటిని కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కేటాయింపులు జరిగితే కృష్ణాలో తెలంగాణకు మరింత అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు అడుగు నుంచీ నీటిని తరలించేలా పోతిరెడ్డిపాడుతో ఏపీ ఓ పెద్ద నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకుంది. మొత్తం 14 వెంట్స్ద్వారా లక్షన్నర క్యూసెక్కులు తరలించుకునేలా శ్రీశైలం రైట్‌మెయిన్ కెనాల్ కెపాసిటీని పెంచుతున్నది. దానికి లైనింగ్ వేయిస్తున్నది. ప్రస్తుతం తరలిస్తున్నది 88 వేల క్యూసెక్కులే అయినా.. భవిష్యత్‌లో మాత్రం మరింతగా ఏపీ దోపిడీ పెరుగుతుంది. దానికితోడు హంద్రీనీవా, మల్యాల వంటి లిఫ్ట్ స్కీమ్‌ల ద్వారా కూడా నీటిని తరలిస్తున్నది. అదే సమయంలో మనకు మాత్రం ఏపీకి ఉన్నంత నెట్వర్క్ లేదు. ఇప్పుడిప్పుడే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ముందుకు వెళ్తున్నది.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావొస్తున్నది. అయితే, కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంచినా.. మహారాష్ట్ర తన కోటా నీళ్లు వాడుకున్నా మన పాలమూరు – రంగారెడ్డితో పాటు ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి లిఫ్ట్‌లకు నష్టం కలగకమానదు. ఇటు దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకూ ఇన్‌ఫ్లోస్ తగ్గే ప్రమాదమూ లేకపోలేదు. వరదలు మంచిగొచ్చి ప్రాజెక్టులు అన్ని నిండితే తప్ప మన ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఉండదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.