బెంగళూరు: ఇండియా డబుల్స్ జోడీ సాకేత్ మైనేని–నిక్కి పునాచా జోడీ.. కర్ణాటక ఓపెన్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సాకేత్–పునాచా 6–2, 6–3తో పెట్రా బార్ బిర్యుకోవ్–గ్రిగోరి లోమకిన్‌పై గెలిచారు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సాకేత్ ద్వయం వరుస పాయింట్లతో హోరెత్తించింది.
ఈ విజయంతో సాకేత్ ద్వయానికి 50 ఏటీపీ పాయింట్లతో పాటు 2980 డాలర్ల (రూ. 2.85 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో కీగన్ స్మిత్ 6–2, 7–5తో ఫిలిప్ సెకులిక్‌ను ఓడించాడు. మ్యాచ్ ఆరంభంలో కాస్త తడబడిన స్మిత్ మూడో గేమ్‌లో సర్వీస్ చేజార్చుకున్నాడు.
కానీ నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వ్ బ్రేక్ చేసి పుంజుకున్నాడు. అక్కడినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. రెండో సెట్ ఏడో గేమ్‌లో సెకులిచ్ బ్రేక్ పాయింట్ కాచుకున్నా.. తర్వాతి గేమ్‌లో సర్వ్‌ను కాపాడుకున్నాడు. చివరి వరకు 12వ గేమ్‌ను బ్రేక్ చేసి సెట్‌తో పాటు టైటిల్ కైవసం చేసుకున్నాడు.
