రోడ్డేసే వరకూ పెండ్లి చేసుకోనన్న యువతి.. స్పందించిన సీఎం

రోడ్డేసే వరకూ పెండ్లి చేసుకోనన్న యువతి.. స్పందించిన సీఎం

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఆ ఊరికి తీరని సమస్య అది.. ఒక అమ్మాయి ప్రతిజ్ఞతో నేడు అధికార యంత్రాంగం ఉరుకులు పరుగుల మీద కదిలింది. ఏకంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో వారం తిరక్కుండా అధికారులు వచ్చి సర్వే చేశారు. రోడ్డు వేయడంతో పాటు బస్సు సర్వీస్‌ కూడా స్టార్ట్ చేస్తామని మాటిచ్చారు. ఇదంతా ఒక 26 ఏండ్ల యువతి తన ఊరికి రోడ్డు వేసే వరకూ పెండ్లి చేసుకోబోనని ప్రతిజ్ఞ చేయడం వల్లే జరిగింది.

ఎవరా అమ్మాయి?

కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో ఒక మారుమూల పల్లె హెచ్‌ రామ్‌పురా. ఆ ఊరిలో ఉండే 26 ఏండ్ల యువతి ఆర్‌‌డీ బిందు దావణగిరి యూనివర్సిటీలో పీజీ (ఎకనమిక్స్‌) పూర్తి చేసింది. ఆమె టీచర్‌‌గా పని చేస్తోంది. ఇప్పుడు ఆమెకు తల్లిదండ్రులు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమెకు కూడా పెండ్లి చేసుకునే విషయంలో ఏ అభ్యంతరం లేదు. కానీ ఆ ఊరికి ఎప్పటి నుంచో తీరని సమస్య బిందు మనసును తొలిచివేసింది. తాను పెండ్లి చేసుకుని మరో ఊరు వెళ్లిపోతే తన తల్లిదండ్రులు, బంధువులు, ఊరి వాళ్లు ఎప్పటికీ రోడ్డు లేక అదే సమస్యతో బతుకు సాగదీయాల్సిందేనా అన్న ప్రశ్న ఆమెను వేధించసాగింది. పైగా ఆ ఊరిలో ఐదో తరగతి వరకు మాత్రమే బడి ఉండడంతో ఆమె మరో ఊరిలో హాస్టల్‌లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించక కొంత మంది రోజూ 14 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకునే వాళ్లు.. మరి కొంత మంది చదువు మానేశారు. స్వాతంత్ర్య వచ్చిన నాటి నుంచి ఆ ఊరి పెద్దలు రాజకీయ నేతలు అర్జీలు ఇవ్వడం.. వాటిపై సరే అని తర్వాత నాయకులు పట్టించుకోకపోవడం లాంటివి తెలిసి ఇక ఏం చేయలేమా అన్న ఆలోచన బిందులో మొదలైంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకూ తాను పెండ్లి చేసుకోకూడదని నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈ నెల 9న సీఎం బసవరాజ్‌ బొమ్మైకు ఈ మెయిల్‌ పంపింది. పిల్లలు స్కూల్‌కు వెళ్లాలన్నా, హాస్పిటల్‌కు వెళ్లాలన్నా  కనీసం 14 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని, ఊరికి పక్కనే ఉన్న మయకొండ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు వేయాలని స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పోరాడుతున్నామని ఊరి పెద్దలు చెప్పారని బిందు తెలిపింది. ఊరి సమస్య తీరడం కోసం తన వంతు ప్రయత్నంగా సీఎంకు మెయిల్ పంపానని చెప్పింది.

సీఎం ఆదేశాలతో ఊర్లోకి అధికారులు

బిందు మెయిల్‌తో సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. వెంటనే సీఎస్‌కు ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. దీంతో దానిపై అధ్యయనానికి గురవారం నాడు దావణగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్‌‌ మహంతేశ్ బిలగి నేతృత్వంలో అధికారుల టీమ్‌ హెచ్‌ రామ్‌పురా గ్రామానికి వచ్చింది. గుంతలు గుంతలుగా ఉన్న మట్టి రోడ్డుపై అధికారుల వాహనాలు వెళ్లడం కుదరకపోవడంతో దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి ఆ ఊరిలోకి పోవాల్సి వచ్చింది.  ఈ సందర్బంగా మహంతేశ్ మాట్లాడుతూ పక్క ఊర్లతో హెచ్‌ రామ్‌పురాకు కనెక్టింగ్ రోడ్డు వేసి.. బస్సు సర్వీసును కూడా తర్వలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం నుంచే రోడ్డు పనులు మొదలవుతాయని ఆయన చెప్పారు. దీనిపై బిందు మాట్లాడుతూ త్వరలోనే ఊరికి రోడ్డు, బస్సు వచ్చేస్తాయని డిప్యూటీ కమిషనర్ చెప్పారని, ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన వారందరికీ థ్యాంక్స్ అని చెప్పింది.