V6 News

Karthi: సేమ్ బాలయ్య పరిస్థితే కార్తీకి.. 'అన్నగారు వస్తారు' రిలీజ్‍కు బ్రేక్.. అప్పు కట్టాల్సిందే అని కోర్టు ఆర్డర్!

Karthi: సేమ్ బాలయ్య పరిస్థితే కార్తీకి.. 'అన్నగారు వస్తారు' రిలీజ్‍కు బ్రేక్.. అప్పు కట్టాల్సిందే అని కోర్టు ఆర్డర్!

తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు నలన్ కుమారసామి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'వా వాత్తియార్' ( అన్నగారు వస్తారు ).మరికొన్ని గంటల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న  ఈ మూవీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయాల్సి ఉన్న ఈ సినిమాకి మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఓ పాత ఆర్థిక వివాదానికి సంబంధించి పెద్ద మొత్తంలో అప్పు తీర్చే వరకు ఈ సినిమాను ఏ రూపంలోనూ విడుదల చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.

గట్టెక్కిన 'అఖండ 2'

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' డిసెంబర్ 5న విడదలకు సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లోనే రిలీజ్ కు సిద్ధమువుతున్న  సమయంలో  కోర్టు స్టే కారణంగా వాయిదా పడింది. నిర్మాతలకు సంబంధించి  ఆర్థిక బకాయిలు, ముఖ్యంగా 14 రీల్స్ ప్లస్, ఈరోస్ సంస్థల మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. దీంతో  చిత్ర నిర్మాణ సంస్థలు వారం రోజుల వ్యవధిలో న్యాయపరమైన, ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకున్నాయి. ఫలితంగా, మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, వారం రోజుల పాటు ఆలస్యమైన, 'అఖండ 2' ఎట్టకేలకు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  బాక్సాఫీస్ వద్ద తాండవం సృష్టించేందుకు సిద్ధమైంది.

'వా వాత్తియార్'కు బ్రేక్...

'అఖండ 2'కు దారి సుగమం కాగా.. ఇదే డిసెంబర్ 12న విడుదల కావాల్సిన కార్తీ చిత్రం 'వా వాత్తియార్' ( అన్నగారు వస్తారు ) మాత్రం ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా పాత ఆర్థిక వివాదానికి సంబంధించి దాదాపు రూ. 21 కోట్లకు పైగా ఉన్న రుణాన్ని వెంటనే చెల్లించాలంటూ మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న అభిమానులకు  కోర్టు తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసింది.

దర్శకుడు నలన్ కుమారసామి, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వంటి ప్రతిభావంతుల కలయికలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. గతంలో 'కంగువ' వంటి చిత్రాల విషయంలో కూడా నిర్మాత కోర్టుకు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి తాత్కాలిక అనుమతి పొందినప్పటికీ, ఈసారి మాత్రం అప్పును పూర్తిగా తీర్చే వరకు విడుదలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు పంపిణీదారులలో, థియేటర్ యజమానులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తక్షణ పరిష్కారమే కీలకం

కానీ, 'వా వాత్తియార్' విషయంలో, నిర్మాత బకాయిల చెల్లింపు విషయంలో నిలకడ చూపనందున, కోర్టు ఈసారి కఠినంగా వ్యవహరిస్తోంది. రూ. 21 కోట్లకు పైగా అప్పును పూర్తిగా తీర్చే వరకు సినిమా విడుదల సాధ్యం కాదు అని తేల్చి చెప్పింది. ఈ అడ్డంకి ఎంత త్వరగా తొలగిపోతుందనే దానిపైనే కార్తీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.