
- ఇంగ్లండ్ టూర్‌కు టీమ్ ప్రకటన
న్యూఢిల్లీ: డొమెస్టిక్ సర్క్యూట్‌లో దంచికొట్టిన విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్‌ను ఎట్టకేలకు సెలక్టర్లు కరుణించారు. దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత ఇండియా–ఎ జట్టులో అతనికి చోటు కల్పించారు. దీంతో రోహిత్, విరాట్ రిటైర్మెంట్ నేపథ్యంలో కరుణ్‌కు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగమైందని అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ శుక్రవారం 18 మందితో కూడిన ఇండియా–ఎ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వర్‌ను ఎంపిక చేశారు. టెస్టు జట్టు రెగ్యులర్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ జట్టులోకి వచ్చారు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు సన్నాహాకంగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ నెల 30న కాంటెర్‌బరీలో తొలి మ్యాచ్ జరగనుంది. టెస్టు కెప్టెన్‌గా ఎంపికవుతాడని భావిస్తున్న శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ జూన్ 6 నుంచి నార్తంప్టన్‌లో జరిగే రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత జూన్ 13 నుంచి 16 వరకు బెకెన్‌హామ్‌లో సీనియర్, ఇండియా–ఎ జట్లు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనున్నాయి. నాలుగు రోజుల విరామం తర్వాత లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ ఆలస్యమైనా టీమిండియా ఒరిజినల్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని బీసీసీఐ వెల్లడించింది.
రంజీ ట్రోఫీలో 69 వికెట్లు తీసిన విదర్భ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబేకు కూడా అవకాశం దక్కింది. ఇషాన్ కిషన్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. పేసర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, సర్ఫరాజ్ ఖాన్‌కు చాన్స్ ఇచ్చారు.ఇండియా–ఎ టీమ్: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, మానవ్ సుతార్, తనుష్ కొటియాన్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే; గిల్, సాయి సుదర్శన్ (రెండో మ్యాచ్‌కు).