
అనవసరంగా రోడ్డెక్కుతున్న పోకిరీలను గుర్తించేందుకు పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్లోని రణ్ బీర్ సింగ్ పురా పోలీసులు లాక్ డౌన్ ఉల్లంఘనులను వినూత్న రీతిలో శిక్షిస్తున్నారు. రోడ్ల మీదకు వస్తే వారి నుదుటిపై స్టాంపులు వేస్తున్నారు. కొందరికి చేతులపై స్టాంపులు వేస్తున్నారు. ఆ స్టాంపులపై వీరు లాక్ డౌన్ ఉల్లంఘనులు అని రాసి ఉండటంతోపాటు సంబంధిత పోలీస్ స్టేషన్ పేరు కూడా ఉంది. ఈ స్టాంపులు 15 రోజులపాటు చెడిపోకుండా ఉంటాయట. ఈ గుర్తులు వారు మళ్లీ రోడ్డెక్కితే ఇక అంతే సంగతులు లాఠీ విరగాల్సిందేనంటున్నారు అక్కడి పోలీసులు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఏ మాత్రం లెక్కచేయకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల లాఠీలు విరిగేదాక కొడుతున్నారు. మరికొన్ని చోట్ల గుంజీలు తీయిస్తున్నారు. ఇంకొందరు కప్పగంతులు వేయిస్తున్నారు. కొన్నిచోట్ల వారిచేత రోడ్డు ఊడ్చిస్తున్నారు. మరికొందరైతే మీకు దండం పెడుతాం రోడ్ల మీదకు రాకండి ఆంటూ చేతులెక్కి మొక్కుతున్నారు. ఏ రాష్ట్ర పోలీసులు ఎలా వ్యవహరించినా జనం రోడ్లపైకి రావడం మాత్రం మానుకోవడం లేదు. దీంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు జమ్మూ పోలీసులు.