కొత్త డిగ్రీ కాలేజీలు మంజూరు ఓ చోట.. నిర్వహణ మరోచోట

కొత్త డిగ్రీ కాలేజీలు మంజూరు ఓ చోట.. నిర్వహణ మరోచోట
  • మెదక్​ ఉమెన్స్​ డిగ్రీ కాలేజీ రామాయంపేటలో..
  • కౌడిపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చింతకుంటలో..
  • సౌకర్యాలు లేక స్టూడెంట్స్​ ఇబ్బందులు
  • ఏండ్లు గడుస్తున్నా సొంత భవనాలు కరువు

మెదక్/కౌడిపల్లి, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లాలో కొత్త డిగ్రీ కాలేజీలు మంజూరయ్యాయి. కానీ సొంత భవనాలు నిర్మించలేదు. ఖాళీగా ఉన్న ఇతర భవనాల్లో కాలేజీలు ప్రారంభించారు. దీంతో తరగతి గదులు, హాస్టల్​ గదులు లేక నిర్వహణ ఇబ్బందికరంగా మారింది.  నర్సాపూర్​ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లిలో 2023లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరైంది. కానీ భవనం అందుబాటులో లేదని నర్సాపూర్ మండలం చింతకుంటలోని నర్సాపూర్​ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులను అక్కడే నిర్వహిస్తున్నారు. దీంతో కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీ మంజూరైందన్న పేరే తప్ప కాలేజీ అందుబాటులో లేకపోవడంతో స్టూడెంట్స్​తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

చుట్టు పక్కల గ్రామాల స్టూడెంట్స్​ఆటోలో కౌడిపల్లికి వచ్చి అక్కడి నుంచి ఆర్టీసీ బస్​లో చింత కుంటకు వెళ్లాలి. సమయానికి బస్సులు లేక పోవడంతో స్టూడెంట్స్​కాలేజీకి వెళ్లి రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌడిపల్లి డిగ్రీ కాలేజీలో చేరేందుకు స్టూడెంట్స్​ఇష్టపడడం లేదు. గతేడాది కేవలం 60 మంది స్టూడెంట్స్​మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. ఏర్పాటై మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు డిగ్రీ కాలేజీని కౌడిపల్లికి తరలించలేదు. 

కాలేజీ మంజూరైన మొదట్లో మాజీ ఎమ్మెల్యే కు చెందిన కాంప్లెక్స్ లో డిగ్రీ కాలేజీ ప్రారంభించాలనుకున్నారు. బోర్డు సైతం ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెండోసారి స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో షిఫ్టింగ్ పద్ధతిలో డిగ్రీ కాలేజీ నిర్వహించేందుకు రంగం సిద్ధం కాగా జూనియర్ కాలేజీ స్టూడెంట్స్​అడ్డు చెప్పారు. దీంతో మరోసారి వాయిదా పడింది. దీంతో చింతకుంటలోనే డిగ్రీ కాలేజీ కొనసాగుతోంది. ఇప్పుడు  మూడో సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనప్పటికీ కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీ అందుబాటులోకి రాకపోవడంతో స్టూడెంట్స్​కాలేజీలో చేరేందుకు వెనుకాడుతున్నారు. 

కౌడిపల్లి బాలికల హై స్కూల్​పక్కన బీసీ హాస్టల్ భవనం ఖాళీగా ఉంది. ఇందులో 12 గదులు ఉన్నాయి. రిపేర్లు చేస్తే సొంత భవనం నిర్మించే వరకు డిగ్రీ కాలేజీని అందులో నిర్వహించవచ్చని స్థానికులు అంటున్నారు. అధికారులు మాత్రం ఆ  భవనం శిథిలావస్థకు చేరిందని అందులో కాలేజీ నిర్వహించడం కష్టమని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి కౌడిపల్లి డిగ్రీ కాలేజీకి సొంత భవనం మంజూరు చేయాలని స్టూడెంట్స్​, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. 

ఉమెన్స్​ డిగ్రీ కాలేజీ మూడు చోట్లకు మార్పు

మెదక్ పట్టణంలో 2016లో సోషల్​వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఉమెన్స్​ డిగ్రీ కాలేజీ మంజూరైంది. ఓ ఏడాది పాటు స్టేడియం రోడ్ లోని ట్రైబల్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​కు చెందిన బిల్డింగ్​లో కాలేజీ నిర్వహించారు. ఆ తర్వాత 2017లో కొల్చారానికి తరలించారు. అక్కడ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్ స్కూల్​ కు సంబంధించిన హాస్టల్​ బిల్డింగ్​ లో డిగ్రీ కాలేజీని నిర్వహించారు. స్టూడెంట్స్​సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు లేకపోవడంతో నిర్వహణ కష్టంగా మారింది. 

ఓ దశలో కొల్చారంలో  కొనసాగుతున్న కాలేజీని ఘట్​కేసర్​తరలించే ప్రయత్నం జరిగింది. స్టూడెంట్స్​, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో అధికారులు ఆ ప్రయత్నం విరమించుకున్నారు. 2017 నుంచి ఏడేళ్ల పాటు కొల్చారంలో కొనసాగిన కాలేజీని 2023 ఏప్రిల్​లో రామాయంపేటకు తరలించారు. 7 గ్రూప్​లలో 660 మంది స్టూడెంట్స్​ఉండగా సరైన వసతి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రామాయంపేట పట్టణంలో 2 క్యాంపస్​లలో కాలేజీని నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్​ గ్రూప్​లను వాణి విద్యాలయంలో, సైన్స్​ గ్రూప్​లను వాసవి జూనియర్​ కాలేజీ బిల్డింగ్​లో నిర్వహిస్తున్నారు. కాలేజీ మంజూరై పదేళ్లు కావస్తున్నా ఇంతవరకు సొంత బిల్డింగ్​ నిర్మించకపోవడం గమనార్హం. 

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

 కౌడిపల్లి డిగ్రీ కాలేజీ నర్సాపూర్ మండలం చింతకుంటలో కొనసాగుతోంది. అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు ఉన్నారు.  రెండుసార్లు కౌడిపల్లిలో ప్రారంభించేందుకు ప్రయత్నించినా వాయిదా పడింది. కాలేజీ చింతకుంటలో ఉండడం వల్ల స్టూడెంట్స్​ఇబ్బందిపడుతున్నారు. కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీ ఉంటే స్టూడెంట్స్​కు దూర భారం తగ్గుతుంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

దామోదర్, ఇన్​చార్జి ప్రిన్సిపాల్