సీఎం మనవడి సంబురం కోసమే మెస్సీని తీసుకొచ్చారు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

సీఎం మనవడి సంబురం కోసమే మెస్సీని తీసుకొచ్చారు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
  •     అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ ​రెడ్డి ఆరోపణలు
  •     కౌంటర్​ఇచ్చిన మంత్రులు వాకిటి, అడ్లూరి

 హైదరాబాద్​, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి తన మనవడి సంబరం కోసమే ఫుట్​బాల్​ ప్లేయర్​ మెస్సీని హైదరాబాద్​ తీసుకొచ్చారని హుజురాబాద్ బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి ఆరోపించారు. ఇందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను ఖర్చు చేశారని విమర్శించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా బుధవారం రాత్రి కౌశిక్​ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. 

టీ20 ప్రపంచకప్​లో గెలిచిన టీమ్​ మెంబర్​ తిలక్​ వర్మకు, ఫాస్టెస్ట్​ 100 వికెట్లు తీసిన రిటైర్డ్​ బౌలర్ ప్రజ్ఞాన్ ​ఓజా, ఉమెన్స్​ అండర్19 వరల్డ్ కప్​ టీమ్​ మెంబర్ ​ద్రితి, మాజీ బ్యాడ్మింటన్​ ప్లేయర్​గుత్తా జ్వాలకు ప్రభుత్వం తరపున రూ.కోటి నగదు పురస్కారం, 500 గజాల ప్రభుత్వ స్థలాన్ని అందించాలని కోరారు. వీరంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫేమస్​ క్రీడాకారులని చెప్పారు. 

యూత్​ డిక్లరేషన్​లో చెప్పినట్లుగా అధికారంలోకి రాగానే ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల సంగతేంటని ప్రశ్నించారు. కౌశిక్​ రెడ్డి మాటలకు మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్​ కౌంటర్​ ఇచ్చారు. ‘మెస్సీ ప్రపంచ స్థాయి ఫుట్​బాలర్. ఆయన హైదరాబాద్​కు వచ్చాక రాష్ట్రానికి ప్రపంచంలో గుర్తింపు పెరిగింది’ అని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వ హయంలో ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఓయూలో అడుగు కూడా పెట్టలేకపోయిన బీఆర్ఎస్​ లీడర్లు నిరుద్యోగం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు పలికినట్లుగా ఉంది’ అని మంత్రి అడ్లూరి విమర్శించారు.