లిక్కర్ స్కామ్​లో కవిత మేనల్లుడు.. నగదు లావాదేవీల్లో శ్రీశరణ్ కీలక పాత్ర

లిక్కర్ స్కామ్​లో కవిత మేనల్లుడు.. నగదు లావాదేవీల్లో శ్రీశరణ్ కీలక పాత్ర
  • సీబీఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ
  • కవిత కస్టడీ పిటిషన్​లో కీలక విషయాలు
  • దర్యాప్తుకు కవిత సహకరించడం లేదు
  • ఫోన్ల నుంచి డేటాను ఆమె డిలీట్​ చేసింది 
  • కవిత ఇంట్లో సోదాల టైమ్​లోనే శ్రీశరణ్ ఫోన్ సీజ్ 
  • విచారణకు రావాలని పిలిచినా రాలేదు
  • ఆయనను విచారిస్తే మరిన్ని 
  • వివరాలు బయటకొస్తాయని వెల్లడి
  • హైదరాబాద్​లోని శ్రీశరణ్​ ఇంట్లో సోదాలు 
  • మరో మూడు రోజులు ఈడీ కస్టడీకి కవిత

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్​లో కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్ పేరు తెరపైకి వచ్చింది. కస్టడీలో కవితను విచారించిన సందర్భంగా ఈ స్కామ్ లో ఆమె మేనల్లుడు శ్రీశరణ్ కూడా ఉన్నట్టు తేలిందని సీబీఐ స్పెషల్ కోర్టుకు ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్ లో నగదు లావాదేవీల వ్యవహారాలన్నీ శ్రీశరణ్ కనుసన్నల్లోనే జరిగాయని చెప్పింది. కవిత కస్టడీ ముగియడంతో ఈడీ శనివారం ఆమెను ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. 

ఈ సందర్భంగా కవిత కస్టడీని పొడిగించాలని కోరుతూ ఏడు పేజీల పిటిషన్ దాఖలు చేసింది. అందులో కీలక విషయాలు వెల్లడించింది. ‘‘ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన టైమ్​లో మేక శ్రీశరణ్ ఫోన్ ను సీజ్ చేసినం. ఆ తర్వాత విచారణకు హాజరుకావాలని రెండుసార్లు ఆదేశించినం. కానీ ఆయన విచారణకు రాలేదు. ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించిన నగదు లావాదేవీల వ్యవహారంలో శ్రీశరణ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సమాచారం ఆయన దగ్గర ఉంది. కానీ కేసు దర్యాప్తునకు సహకరించడం లేదు. అందుకే శనివారం (ఈ నెల 23) శ్రీశరణ్ ఇంట్లో సోదాలు జరిపినం. తాజాగా సేకరించిన ఈ సమాచారంపై కవితను మరింత లోతుగా విచారించాల్సి ఉంది” అని పిటిషన్​లో ఈడీ పేర్కొంది. 

‘‘లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర, ఆమె చేసిన లావాదేవీలు తెలియాలంటే శ్రీశరణ్ ను విచారించాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం లిక్కర్ స్కాంలో జరిగిన లావాదేవీలు.. ఈ స్కామ్ లో శ్రీశరణ్, కవిత పాత్ర తేలాలంటే సమీర్ మహేంద్రును కూడా విచారించాల్సిన అవసరం ఉంది” అని ఈడీ తెలిపింది. 

కవిత నిజాలు దాచిపెడుతున్నది.. 

లిక్కర్ స్కామ్ లో దర్యాప్తుకు కవిత సహకరించడం లేదని పిటిషన్ లో ఈడీ పేర్కొంది. ‘‘కవితకు చాలా అవకాశాలు ఇచ్చినా దర్యాప్తుకు సహకరించడం లేదు. కస్టోడియల్ ఇంటరాగేషన్ లో కుంటిసాకులు చెబుతున్నది. నిజాలను దాచిపెడుతున్నది. మొత్తం 7 రోజుల కస్టడీలో కేవలం 5 రోజులు ( ఈ నెల 17, 18, 19, 20, 22 తేదీల్లో) మాత్రమే  ఆమెను విచారించినం. 

ఇవే తేదీల్లో రిమాండ్ లో ఉన్న మరో నలుగురు వ్యక్తుల నుంచి నాలుగు స్టేట్మెంట్లు తీసుకున్నం. అలాగే ఈ కేసులో సహ నిందితులు/ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను విచారించినం. పోయినేడాది విచారణ సందర్భంగా ఆమె మాకు అందజేసిన ఫోన్ లోని డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ నిర్ధారించింది” అని కోర్టుకు వివరించింది. 

292 కోట్ల మనీలాండరింగ్​లో కవిత.. 

ఇటీవల కవిత అరెస్ట్ సందర్భంగా పేర్కొన్న అంశాలను పిటిషన్ లో ఈడీ మరోసారి ప్రస్తావించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి లిక్కర్ స్కామ్ కు కవిత కుట్ర పన్నినట్టు తెలిపింది. ఇందులో భాగంగా రూ.వంద కోట్ల ముడుపుల ప్రస్తావన, నిధుల మళ్లింపు, ఇండో స్పిరిట్ లో కవితకు ఉన్న వాటాల విషయాలను వివరించింది.

ప్రధానంగా ఈ స్కామ్ లో రూ.292.8 కోట్ల మనీలాండరింగ్ వ్యవహారంలో కవిత పాత్ర ఉందని చెప్పింది. ఇతరులతో కలిసి రూ.100 కోట్లను కిక్ బ్యాక్ ల రూపంలో మళ్లించేందుకు ఆమె కుట్ర పన్నారని పేర్కొంది. అలాగే ఇండో స్పిరిట్ లో తన బినామీని పెట్టి రూ.192.8 కోట్ల నేరం చేసినట్టు తెలిపింది. వీటి ఆధారంగానే ఆమెను అరెస్ట్ చేసినట్టు వివరించింది.