- కేసీఆర్ హయాంలోనే 80 శాతం పనులు పూర్తి: కవిత
- సొంత జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేస్తున్నారని కామెంట్
- ఉద్దండాపూర్, కరివెన రిజర్వాయర్ల సందర్శన
మహబూబ్‌నగర్/జడ్చర్ల, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా పాలమూరు– -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అడుగు కూడా ముందుకు పడలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆ పనులను వెంటనే పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో కవిత పర్యటించారు.
ముందుగా షాద్‌నగర్ చేరుకున్న ఆమె అక్కడి మహిళలతో మాట్లాడారు. ఆ తర్వాత పాలమూరు లిఫ్ట్ స్కీమ్‌లో భాగమైన ఉద్దండపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. అక్కడి భూ నిర్వాసితులతో సమావేశమై, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కరివెన రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో కవిత మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ డిజైన్ చేశారని, 80 శాతం పనులు పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన పనులను కాంగ్రెస్రెండేండ్లుగా చేపట్టడం లేదన్నారు. నార్లాపూర్-, ఏదుల మధ్య టన్నెల్ పనులు చేయలేదని, ఉద్దండాపూర్, కరివెన రిజర్వాయర్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టును సుప్రీంకోర్టు సస్పెన్షన్‌లో పెట్టిందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ కూడా వేయలేదని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం లేదన్నారు. పాలమూరు పులి బిడ్డను అని చెప్పుకునే ఆయన సొంత జిల్లాకే తీరని అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ చారిత్రక అన్యాయం చేస్తున్నదని, ప్రజలు వారిని క్షమించరని అన్నారు.
