- సామాజిక తెలంగాణే నా ధ్యేయం
- హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అని విమర్శ
- ‘ఆస్క్ కవిత’ కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు
హైదరాబాద్ , వెలుగు: సామాజిక తెలంగాణే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని ప్రకటించారు. సోమవారం ‘ఆస్క్ కవిత’ హ్యాష్ ట్యాగ్ పై ‘ఎక్స్’ లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని.. అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీ పెట్టడంపై స్పందించిన ఆమె.. ‘‘2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడ్తం. తెలంగాణ సాధికారత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలి.
తెలంగాణలో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలి” అని తెలిపారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా.. యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని కవిత తెలిపారు. త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలన గురించి పలువురు నెటిజన్లు కవితను ప్రశ్నలు అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఓ నెటిజన్.. ‘‘మీరు రాజకీయాలు మానేసి ఏదైనా బిజినెస్ చేసుకోవడం బెటర్. కేసీఆర్ పేరు లేకపోతే పాలిటిక్స్ కు మీరు అన్ ఫిట్’’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై కవిత సీరియస్ అయ్యారు. ‘‘సోషల్ మీడియాను విషపూరితం చేయడం ఆపి.. దయచేసి ముందు నీ మైండ్ సెట్ క్లీన్ చేసుకో’’ అంటూ సదరు నెటిజన్ కు ఆమె రిప్లై ఇచ్చారు.
