- వాటికి తనను క్షమించాలంటూ ప్రజలకు వేడుకోలు
- రాజకీయాల్లో హాట్ టాపిక్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోవివిధ వర్గాలకు జరిగిన అన్యాయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సారీ చెప్తున్న తీరు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఆమె.. జాగృతి జనం బాట కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులన్నింటినీ కవిత ప్రస్తావిస్తున్నారు.
వాటిని జనం కూడా ఆమె దృష్టికి తెస్తున్నారు. అప్పుడు తాను అదే పార్టీలో ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల ఏమీ మాట్లాడలేకపోయానని, ఇందుకు తనను క్షమించాలని ప్రజలను కవిత వేడుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు, ఉద్యమకారులు, బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని.. ఆయా వర్గాలను కలిసినప్పుడు వారికి ఆమె క్షమాపణలు చెప్తున్నారు.
ఉద్యమకారులతో మొదలు..!
పార్టీ నుంచి బహిష్కరించాక.. కవిత అక్టోబర్ నుంచి జాగృతి జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడ మాట్లాడిన ఆమె.. ప్రాణాలు అర్పించి, ప్రాణాలకు తెగించి కొట్లాడి రాష్ట్రం తెచ్చిన అమరులు, ఉద్యమకారులను బీఆర్ఎస్ పాలనలో పట్టించుకోలేదన్నారు. అప్పుడు తాను కూడా అమరులు, ఉద్యమకారుల కోసం కొట్లాడలేదని చెప్తూనే.. వారికి తన తరఫున క్షమాపణలు తెలియజేశారు.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాటం చేస్తానని తెలిపారు. ఇటు బీసీల కోసం ఉద్యమించిన సందర్భంగా కూడా బీఆర్ఎస్ తీరుపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని అనడం, ఆ తర్వాత పార్టీ పెద్దలు, తన అన్న, బావతోపాటు పార్టీ తీరుపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచే బీసీల కోసం ఉద్యమం చేస్తానని ప్రకటించారు.
అందులో భాగంగానే ధర్నాచౌక్ వద్ద బీసీ సంఘాలతో ధర్నా చేపట్టారు. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధిలో రిజర్వేషన్లను పెంచేందుకు.. వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవని తెలిపారు. ఇందుకు బీసీలకు తాను క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.
తాజాగా రైతులు, నిర్వాసితులకు..!
గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం, గిరిజన మహిళా రైతులను జైలుకు పంపడం వంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇటు ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులపైనా కేసులు పెట్టారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో కవిత పర్యటించిన సందర్భంగా ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు, రైతులతో మాట్లాడారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్మార్చాలని పోరాడిన తమపై బీఆర్ఎస్ హయాంలో కేసులు పెట్టి బేడీలు వేయించారని ఆమె ముందు రైతులు వాపోయారు. దీంతో.. నాడు రైతులకు బేడీలు వేసిన విషయం తనకు తెలియదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయం తన దృష్టికే రాలేదని, తెలిసుంటే పోరాడేదానని చెప్పారు. ఇందుకు తనను క్షమించాలని ఆమె కోరారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిర్వాసితులకు సరైన పరిహారమూ అందలేదన్నారు. ఈ క్రమంలోనే.. వారి తరఫున పోరాడుతానని, అవసరమైతే అలైన్మెంట్మార్చేందుకు కేంద్ర మంత్రి గడ్కరీ అపాయింట్మెంట్ కోరుతానని హామీ ఇచ్చారు.
