బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ది సోషల్ మీడియా యుద్ధం: ఎమ్మెల్సీ కవిత

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ది సోషల్ మీడియా యుద్ధం: ఎమ్మెల్సీ కవిత
  • రామన్న.. ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ను వీడి జనంలోకి రావాలి: కవిత 
  • కేటీఆర్, హరీశ్ పేరుకే కృష్ణార్జునులు.. వాళ్లపై వాళ్లే బాణాలు వేసుకుంటున్నరు
  • సొంత పార్టీనే హరీశ్‌‌‌‌ మోసం చేస్తున్నడు 
  • జూబ్లీహిల్స్‌‌‌‌లో  ఓటమికి బీఆర్ఎస్  ముఖ్య నేతలే కారణం 
  • హరీశ్, గంగుల, నవీన్ రావు భూములు కాపాడేందుకే ట్రిపుల్​ ఆర్ అలైన్‌‌‌‌మెంట్ మార్పు 
  • కేసీఆర్ కండ్లకు గంతలు కట్టి అక్రమార్కులను కేటీఆర్, హరీశ్ కాపాడుతున్నారని ఫైర్ 

మెదక్, వెలుగు: బీఆర్ఎస్​ అగ్రనేతలు సోషల్​మీడియాలో యుద్ధం చేస్తున్నారు తప్ప.. గ్రౌండ్‌‌‌‌లో చేయడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. రామన్న(కేటీఆర్) ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ను వీడి, జనంలోకి వచ్చి పోరాడాలని సూచించారు. ‘జాగృతి జనం బాట’లో భాగంగా మెదక్‌‌‌‌లో పర్యటిస్తున్న కవిత.. శనివారం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల వైఖరి వల్లే  జూబ్లీహిల్స్ బైపోల్‌‌‌‌లో ఆ పార్టీ ఓడిపోయిందని ఆమె అన్నారు. 

‘‘పేరుకు కృష్ణార్జునులమని చెప్పుకుంటున్న కేటీఆర్, హరీశ్​రావు.. పక్క పార్టీల మీద వేయాల్సిన బాణాలను వాళ్లపై వాళ్లే వేసుకుంటున్నారు. ఇలా చేస్తే బలయ్యేది బీఆర్ఎస్​కార్యకర్తలు కాదా? జూబ్లీహిల్స్​ఫలితం చూశాకనైనా ప్రతిపక్షంగా సరైన పాత్ర పోషించడం లేదని వాళ్లు గ్రహించాలి. ఒకరికొకరు ట్వీట్లు పెట్టుకుని, వాళ్లది వాళ్లు జబ్బలు చరుచుకునుడు తప్పితే.. క్షేత్రస్థాయిలో పని చేయడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాలా కుట్రలు జరిగాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడు అవన్నీ చెబుతాను” అని తెలిపారు. 

బీఆర్ఎస్‌‌కు హరీశ్ మోసం.. 

హరీశ్‌‌రావు బీఆర్‌‌‌‌ఎస్‌‌లోనే ఉండి, ఆ పార్టీనే మోసం చేస్తున్నారని కవిత ఆరోపించారు. ‘‘15 మంది ఇండిపెండెంట్లు నా దగ్గరికి వచ్చి.. ‘అక్కా.. మేం విత్‌‌డ్రా చేసుకుంటాం. ఎవరికి సపోర్ట్​ చేయమంటారు’ అని నన్ను అడిగారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో నాకేం సంబంధం లేదని, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్లండని వాళ్లకు చెప్పాను. వాళ్లు సక్కగా హరీశ్‌‌ రావు దగ్గరికి వెళ్లారు. 

నేనంటే బీఆర్ఎస్‌‌లో లేను. ఏ పార్టీకి సపోర్ట్​ చేయదలచుకోలేదు కాబట్టి దూరంగా ఉన్నాను. కానీ హరీశ్​ రావు కూడా అదే ఆన్సర్​ చెప్పారట. ‘మీ ఇష్టం.. ఎవరికన్నా సపోర్టు చేసుకోండి’ అని అన్నారట. అలాగే బైఎలక్షన్ కంటే ముందే.. బీఆర్‌‌‌‌ఎస్ నుంచి ఫలానా క్యాండిడేట్‌‌ను పెడుతున్నామని కాంగ్రెస్‌‌కు చెప్పారట. అంటే ఆయన బీఆర్‌‌‌‌ఎస్‌‌లోనే ఉండి, ఆ పార్టీని మోసం చేసినట్టు కదా?” అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు హరీశ్ మస్తు కష్టపడ్డాడని భజన చేసిన కొంతమంది.. ఇప్పుడు హరీశన్న లేకనే జూబ్లీహిల్స్‌‌లో ఓడిపోయామని అంటున్నారని పేర్కొన్నారు. 

తప్పు చేసి తప్పించుకోవడం, మోసం చేయడం హరీశ్‌‌కు అలవాటేనని విమర్శించారు. ‘‘హరీశ్‌‌ రావు పాల వ్యాపారం పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు పాలు సరఫరా చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించారు. దీనిపై 2024 సెప్టెంబర్ 22న అప్పటి సీఎం పీఆర్‌‌‌‌వో అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు. మళ్లీ కొద్ది రోజులకే దాన్ని డిలీట్ చేశారు. హరీశ్ రావు బినామీల దందాలు బయటకు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను ఎందుకు కాపాడుతున్నారు? వాళ్లిద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ఏంటి?” అని ప్రశ్నించారు. 

అందుకే బీఆర్‌‌‌‌ఎస్‌‌కు అధోగతి.. 

కార్యకర్తలను ముంచి, నాయకులు ఎదగడం బీఆర్ఎస్‌‌లో కామన్​అయిపోయిందని కవిత అన్నారు. కేసీఆర్​కండ్లకు గంతలు కట్టి అక్రమార్కులను కేటీఆర్, హరీశ్ కాపాడుతున్నరని ఆరోపించారు. ‘‘నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి, చిప్పల్‌‌తుర్తి వద్ద హరీశ్‌‌ రావుకు 400 ఎకరాల్లో ఫామ్‌‌హౌస్, ఫైవ్ స్టార్ రిసార్ట్ ఉన్నదని అక్కడి గ్రామస్తులు చెప్పారు. అలాగే చిన్న చింతకుంట వద్ద గంగుల కమలాకర్ 15 ఎకరాల్లో కెమికల్ ఫ్యాక్టరీ కట్టేందుకు ప్లాన్ చేశారు. 

కానీ గ్రామస్తులు వ్యతిరేకించడంతో ఆపేశారు. మాజీ  ఎమ్మెల్సీ నవీన్ రావుకు అక్కడే 18 ఎకరాల భూమి ఉంది. ఈ ముగ్గురి భూములు కాపాడేందుకే ట్రిపుల్ ఆర్ అలైన్‌‌మెంట్ మార్చి వంకలుగా తిప్పి 56 మంది పేద రైతులకు అన్యాయం చేశారు. కేసీఆర్‌‌‌‌కు ఇవన్నీ తెలిస్తే ఒప్పుకునేవారు కాదు. అందుకే ఆయన కండ్లకు గంతలు కట్టి అరాచకాలకు పాల్పడ్డారు. ఫలితంగానే బీఆర్ఎస్ అధోగతి పాలైంది” అని అన్నారు.