
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది. లిక్కర్ స్కాంలో కవితతో పాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సీబీఐ ఇటీవల సప్లిమెం టరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో తప్పులు ఉన్నాయని ఆరోపిస్తూ తనకు బెయిలివ్వాలని కోరుతూ కవిత ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు.
గతవారం సీబీఐ చార్జ్‌షీట్, కవిత బెయిల్ పిటిషన్‌పై ట్రయల్ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా విచారణ జరిపారు. చార్జ్‌షీట్‌ను పరిగణన లోకి తీసుకునే అంశంతో పాటు కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 26 వరకు కోర్టు పొడిగించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైల్ నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు.
అయితే, ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా సెలవులో ఉండడంతో మరోసారి విచారణ వాయిదా పడింది. కవిత జ్యుడీషియల్ కస్టడీతో పాటు చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 31న విచారణ చేపట్టనున్నట్టు ట్రయల్ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.