ఏపీ చేపట్టిన సాగర్ సొరంగం పనులను ఆపించాలి : టీఆర్ఎస్ చీఫ్ కవిత

ఏపీ చేపట్టిన సాగర్ సొరంగం పనులను ఆపించాలి : టీఆర్ఎస్ చీఫ్ కవిత

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్‌‌‌‌ను చెరబట్టి గుట్టుచప్పుడు కాకుండా టన్నెల్ ప్రాజెక్టును నిర్మిస్తుంటే రాష్ట్ర సీఎంగా రేవంత్​రెడ్డి ఏం చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే ఆపించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నాగార్జున సాగర్ నుంచి ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టు వ్యవహారంపై బుధవారం ‘ఎక్స్’లో ఆమె స్పందించారు. సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ భారీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టినా, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతితోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టిందా? అని నిలదీశారు.

పొరుగు రాష్ట్రం ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నా తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారుకు కనీస సమాచారం లేదంటే రాష్ట్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తోందో చెప్పాలని ఆమె నిలదీశారు. ఏపీ చేపడుతున్న ఈ అక్రమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదనే పరిస్థితి ఉంటే, సీఎంగా రేవంత్ రెడ్డి ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఉండడానికి అర్హుడు కాడని కవిత స్పష్టం చేశారు.