ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో తెలంగాణ ప్రభుత్వం..నాటి బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో  తెలంగాణ ప్రభుత్వం..నాటి బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ :  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • సీఎం నియోజవర్గానికి అన్ని కోట్లా? మేమేం పాపం చేసినం? 
  • మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

చండూరు, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్​ ప్రభుత్వం ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో నడుస్తోందంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించకుండా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌‌‌‌కు రూ.10 వేల కోట్లు ఎలా తీసుకెళ్తారని నిలదీశారు. ఫ్లోరైడ్ నీటితో విషం తాగుతున్న మునుగోడు ప్రజల కోసం చెరువులు, కుంటల అభివృద్ధికి రూ.500 కోట్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మునుగోడు ప్రజల జోలికి వస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు. బుధవారం నల్గొండ జిల్లా మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

పండబెట్టి తొక్కుతావా.. ఇదేనా సీఎం భాష?

‎నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి పండబెట్టి తొక్కుతా అంటున్నారని రాజగోపాల్‌‌‌‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఏం భాష నీది? ప్రశ్నిస్తే పండబెట్టి తొక్కుతావా? నువ్వు సీఎం వేనా? రాష్ట్రానికి తండ్రి పాత్ర పోషించాల్సిన సీఎం అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలి. సొంత నియోజకవర్గానికి వేల కోట్లు తీసుకెళ్తూ మిగతా ప్రాంతాలపై వివక్ష చూపడం సరైన పద్ధతి కాదు’’ అని తెలిపారు.

మూడేండ్లుగా ‎డిండి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం కాలేదని, ప్రాజెక్టును పడకేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చౌటుప్పల్‌‌‌‌లో వంద పడకల ఆస్పత్రి ఇప్పటికీ ప్రారంభించలేదని పేర్కొన్నారు. ‎నియోజకవర్గ సమస్యలపై పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

‎రూ.1,500 కోట్ల పనులు.. బిల్లులేవి?

‎మునుగోడు నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో రోడ్లు నిర్మించినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌ రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్ర కాంట్రాక్టర్లకు తొత్తుగా మారి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందన్నారు.