అప్పుడు శ్రీశైలానికి పొక్క .. ఇప్పుడు సాగర్‌‌‌‌కు కన్నం..బోర్డు పర్మిషన్ లేకుండా ఏపీ సొరంగం: కేటీఆర్

అప్పుడు శ్రీశైలానికి పొక్క .. ఇప్పుడు సాగర్‌‌‌‌కు కన్నం..బోర్డు పర్మిషన్ లేకుండా ఏపీ సొరంగం: కేటీఆర్

తాగునీరు పేరుతో 90 టీఎంసీల తరలింపునకు కుట్ర

  • డెడ్ స్టోరేజీ నుంచి తోడుతుంటే సర్కారు మౌనమేల?
  • ఇంటెలిజెన్స్, ఇరిగేషన్ శాఖలు ఏం చేస్తున్నయ్?
  • ఆదిత్యనాథ్ దాస్‌‌‌‌ను 
  • ఎవరి ఒత్తిడితో పెట్టుకున్నరు?
  • నల్గొండలో భారీ సభ పెడ్తం..  
  • న్యాయపోరాటానికీ వెనుకాడమన్న కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్‌‌లో భారీ సొరంగం నిర్మించి, ఎలాంటి అనుమతులు లేకుండా కేఆర్ఎంబీకి సమాచారం ఇవ్వకుండా 90 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించే కుట్ర చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే శ్రీశైలానికి పొక్కపెట్టి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తోడుకుంటున్న ఆంధ్రా పాలకులు ఇప్పుడు ఏకంగా నాగార్జునసాగర్‌‌కే కన్నం వేస్తున్నారని ఆరోపించారు. 

తాగునీటి పథకం పేరుతో పైప్‌‌లైన్ నిర్మించి 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని, పేరుకు తాగునీటి పథకమైనా దాని ముసుగులో సాగునీటిని కూడా తరలించే కుట్ర జరుగుతోందని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సమైక్య పాలనలో పోతిరెడ్డిపాడుకు గండి కొట్టి శ్రీశైలం నుంచి నీటిని తరలించారని, ఇప్పుడు నాగార్జునసాగర్ దగ్గర అదే తరహా దోపిడీకి పాల్పడుతున్నారని, ఇది ఆనాటి ద్రోహం కంటే మరింత తీవ్రమైనదన్నారు.

నల్గొండ మంత్రి మౌనమేల?

డెడ్ స్టోరేజీ నీటిని తరలిస్తుంటే నల్గొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని   ప్రశ్నించారు. తాగునీటి పథకం ముసుగులో డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తోడుకునేందుకు ఏపీ జలదోపిడీకి తెరలేపినా, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శించారు. సాగర్ దగ్గర విజయపురి సౌత్ సమీపంలో 510 అడుగుల దిగువ నుంచి నీటిని తరలించేందుకు సొరంగం తవ్వుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా, ఇంటెలిజెన్స్, ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇవ్వలేదా అని నిలదీశారు. సాగర్‌‌లో నీటి అక్రమ తరలింపుపై అవసరమైతే  న్యాయపోరాటం, నల్గొండలో భారీ బహిరంగ సభ, మహబూబ్‌‌నగర్ జిల్లాలో ఉద్యమ కార్యాచరణతో ప్రజలను చైతన్యపరుస్తామని హెచ్చరించారు. 

ఎవరి ఒత్తిడితో ఆదిత్యనాథ్ దాస్‌‌ను పెట్టుకున్నరు?

ఉమ్మడి రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసిన ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్‌‌ను ఎవరి ఒత్తిడితో ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకున్నారో సీఎం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈఎన్సీ రమేశ్ బాబు రిటైరైన తర్వాత ఏడాది పాటు పొడిగించి మళ్లీ నియమించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 

కృష్ణాలో కాంగ్రెస్ ద్రోహం

1930లోనే నల్గొండ జిల్లా ఏలేశ్వరం దగ్గర 161 టీఎంసీల సామర్థ్యంతో పది లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధమైనా, ఏపీ ఏర్పాటుకు ముందే దాన్ని కిందికి మార్చి నందికొండ దగ్గర నాగార్జునసాగర్‌‌కు ప్రతిపాదించి తొలి ద్రోహం చేశారని కేటీఆర్ చెప్పారు. సాగర్ కింద తెలంగాణకు 8.8 లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పి ఇప్పటికీ ఆరు లక్షల ఎకరాలకు మించి ఇవ్వలేదని, ఏపీకి మాత్రం 15.5 లక్షల ఎకరాలకు నీరందేలా ప్రాజెక్టును మార్చారని, స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణకు 28 శాతం, ఏపీకి 72 శాతం దక్కిందని అన్నారు. పాలమూరులో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 174 టీఎంసీల గ్రావిటీ నీటిని అందించకుండా ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాజెక్టులను నిర్వీర్యం చేశాయని ఆరోపించారు.