- ఉద్యమకారులను రక్తం వచ్చేలా పోలీసులతో కొట్టిస్తరా?: కవిత
- ఉద్యమకారులకు భూములు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఉప్పల్ భగాయత్‌లో ఆందోళన
- కవిత సహా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కవిత హెచ్చరించారు. ఉద్యమకారులతో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదని, ఇప్పుడు కూడా బాగుపడదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాష్టీకానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ఉద్యమకారులకు ఉప్పల్ భగాయత్ భూములు కేటాయించాలన్న డిమాండ్‌తో గురువారం ఆమె అక్కడ భూ పోరాటానికి వెళ్లారు. అక్కడే బొడ్రాయిని ప్రతిష్టించి.. బోనం ఎత్తుకుని పూజలు చేశారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఉప్పల్ భగాయత్‌కు చేరుకోగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. భూ పోరాటానికి సిద్ధమైన కవిత సహా పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో కవిత రాళ్ల మీద పడిపోయారు. అనంతరం ఆమెతో సహా పార్టీ నేతలను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం ఆమెను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉద్యమకారులకు మద్దతుగా పోరాటం చేసేందుకు వెళ్లిన తనను, తమ పార్టీ మహిళలను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లారని మండిప్డడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 30 నెలలు గడిచినప్పటికీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోలీసులతో కొట్టిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఉద్యమకారులను రక్తాలు వచ్చేలా కొడితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, ఉప్పల్ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏకి చెందిన భూమికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు.
