- వారి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం బంజారా ప్రముఖులతో భేటీ అయ్యారు. రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ తో పాటు పలువురు బంజారా సామాజికవర్గ ప్రముఖులను కలిశారు. బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ర్ట క్యాబినెట్ లో బంజారాలకు చోటు లేకపోవడం బాధాకరమని, ఉమ్మడి ఏపీలో ఎప్పుడూ మంత్రివర్గంలో బంజారాలకు ప్రాతినిధ్యం లేకుండా లేదని కవిత దృష్టికి బంజారా ప్రముఖులు తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గంలో బంజారాలకు స్థానం కల్పించలేదని మండిపడ్డారు.
తాము స్థాపించే కొత్త పార్టీలో బంజారాలకు సముచిత గౌరవం, రాజకీయ అవకాశాలు కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. కొత్త పార్టీ విధివిధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు తమ అమూల్యమైన సలహాలు అందించాలని కోరారు. సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ మాజీ కమిషనర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ భీమ్లా నాయక్, బస్కీ నాయక్, పలువురు నేతలు పాల్గొన్నారు.
ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీకి కవిత పరామర్శ
బంజారాహిల్స్ లోని వెల్ నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న అన్సారీ ని కవిత పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అన్సారీ ప్రొఫెసర్ గా, విద్యార్థిగా వర్సిటీలో జరిగిన అక్రమాలను బయటికి తీయడానికి ఎంతో కృషి చేశారన్నారు. 2023 లో ఆయన రిటైర్ అయితే ఇప్పటి వరకు రిటైర్ మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వలేదని, ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైతే ట్రీట్ మెంట్ కు క్రౌడ్ ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అయినప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని ఇదే విధంగా దాదాపు 143 మంది ప్రొఫెసర్లు రిటైర్ మెంట్ బెన్ ఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారని ఆమె గుర్తు చేశారు. రిటైర్ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిటైర్ మెంట్ బెన్ ఫిట్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు.
