ఏప్రిల్ 23 దాకా కవితకు జ్యుడీషియల్​ కస్టడీ

ఏప్రిల్ 23 దాకా కవితకు జ్యుడీషియల్​ కస్టడీ
  • పొడిగించిన సీబీఐ స్పెషల్ కోర్టు
  • కోర్టులో కవితను కలిసిన కుటుంబసభ్యులు 

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఈ నెల 23 దాకా జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కవితకు గత నెల 26న కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ టైమ్ ముగియడంతో ఈడీ అధికారులు మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. 

ఈ సందర్భంగా ఈడీ తరఫున అడ్వొకేట్ జోహెబ్ హుస్సేన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని అన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, అందువల్ల ఆమె కస్టడీని మరో14 రోజులు పొడిగించాలని కోరారు. కవిత తరఫున అడ్వొకేట్ నితీశ్ రాణా వాది స్తూ.. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరడానికి ఈడీ వద్ద కొత్త కారణాలేమీ లేవన్నారు. 

2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతున్నదని, అప్పటి నుంచి కవిత దర్యాప్తును ప్రభావితం చేసే వ్యక్తి అని ఈడీ ఆరోపిస్తున్నదన్నారు. కానీ ఇప్పటి వరకు కవిత అలాంటిదేమీ చేయలేదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా... తీర్పును కాసేపు రిజర్వ్ చేశారు. అనంతరం కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్టు తీర్పు ఇచ్చారు. తిరిగి ఈ నెల 23న ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. 

కుటుంబసభ్యులతో మాట్లాడిన కవిత.. 

అంతకుముందు కోర్టు హాల్ లోనే కవితతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అనుమతివ్వాలని ఆమె తరఫు న్యాయవాది రాణా కోర్టును కోరారు. అయితే అందుకు స్పెషల్ జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. దీంతో కవితను ఆమె భర్త అనిల్, మామ రామకిషన్ రావు, మరిది కలిసేందుకు అనుమతివ్వాలని అడ్వొకేట్ అప్లికేషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. తర్వాత కోర్టు హాల్ లోనే కవితతో ఆమె భర్త, మామ, మరిది కాసేపు మాట్లాడారు. 

బీజేపీకి ఓటు వేయొద్దు: కవిత 

కవిత కోర్టు హాల్ నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా రాజకీయపరమైన కేసు అని ఆమె ఆరోపించారు. తాను విచారణకు సహకరిస్తున్నా, అన్యాయంగా అరెస్ట్ చేశారని అన్నారు. ‘‘కేంద్రంలోని బీజేపీ విపక్ష నేతలపై ఈడీ, సీబీఐని ఉసిగొల్పుతున్నది. బీజేపీకి ఓటు వేయొద్దు” అని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, కవితను జైల్లో పెట్టినప్పటికీ ఆమె ధైర్యంగా ఉందని ఆమె భర్త అనిల్​ చెప్పారు. మంగళవారం కోర్టు హాల్​లో ఆయన కవితను కలిశారు. 

కోర్టుకు ఏదైనా తెలపాలంటే రాతపూర్వకంగా ఇవ్వండి.. 

కవిత వ్యక్తిగతంగా కోర్టుకు ఏదైనా తెలపాలని అనుకుంటే రాతపూర్వకంగా సమర్పించాలని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది. కస్టడీపై వాదనలు ముగిసిన తర్వాత స్పెషల్ జడ్జి కావేరి బవేజా తన చాంబర్ లోకి వెళ్లిపోయారు. అయితే కవితకు కోర్టు హాల్ లో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలనే పిటిషన్ న్యాయమూర్తి ముందు ఉందని, జడ్జికి ఈ విషయం తెలియజేయాలని లాయర్ కోర్టు సిబ్బందిని కోరారు. ఈ విజ్ఞప్తితో స్పెషల్ జడ్జి కావేరి బవేజా తిరిగి కోర్టు హాల్ కు వచ్చారు. కవిత మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరఫు లాయర్ పదేపదే కోరారు. అది ఆమెకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని వాదించారు. అయితే ఎందుకు ఈ అంశంపై పట్టుబడుతున్నారని జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. కాగా, సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి.