
- 30 అనుబంధ విభాగాల ఏర్పాటుకు నిర్ణయం
- ఇప్పటికే మహిళా, యువ జాగృతిల ఏర్పాటు.. తాజాగా సింగరేణి జాగృతి
- ఆర్టీసీ, విద్యార్థి, రైతు, ఉద్యోగ జాగృతిల ఏర్పాటుకూ కసరత్తు
- అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని జాగృతి నేతలకు కవిత పిలుపు?
- కవిత మీటింగ్‌తో టీబీజీకేఎస్ అలర్ట్.. క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత సైన్యం ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారు. పార్టీలో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో సొంత బలాన్ని, బలగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో పార్టీ పరంగా తనకు మద్దతు లభించకున్నా, పార్టీ నుంచి వేరుపడాల్సి వచ్చినా.. తన వెంట నడిచి వచ్చే వారిని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే జాగృతిని బలోపేతం చేస్తున్నారు.
జాగృతికి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేయాలని కవిత నిర్ణయించినట్టు తెలిసింది. పది రోజుల క్రితమే మహిళా, యువ జాగృతిలను ఏర్పాటు చేసిన కవిత.. తాజాగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. త్వరలో ఆర్టీసీ, విద్యార్థి, రైతు, ఉద్యోగ జాగృతిలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓ వారం పది రోజుల్లో ఆయా కమిటీలకు ఒకరూపు తీసుకొచ్చి, వాటిని గ్రౌండ్‌లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది.
కాగా, మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సింగరేణి విభాగం నేతలతో నిర్వహించిన సమావేశంలో కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి జాగృతి విభాగాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణిలోని 11 ఏరియాలకు కోఆర్డినేటర్లనూ నియమించారు. భవిష్యత్తులో ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని నేతలకు కవిత పిలుపునిచ్చారు. అవసరమైతే అన్ని పోరాటాలకు తాను స్వయంగా వచ్చి ముందుంటానని ఆమె స్పష్టం చేసినట్టు తెలిసింది. జాగృతికంటూ సొంత సైన్యం ఉండాలని చెప్పినట్టు సమాచారం. ఇది ఓ రకంగా జాగృతినే సొంత పార్టీగా నడిపించే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
సమస్యలపై పోరాటం..
ప్రభుత్వంపై బీఆర్ఎస్గట్టిగా పోరాడడం లేదన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. అడపాదడపా కేటీఆర్, హరీశ్‌రావు లాంటి నేతలే స్పందిస్తున్నారు తప్ప.. క్షేత్రస్థాయిలో పోరాటాలే లేవని కేడర్నిరుత్సాహ పడుతున్నదన్న చర్చ జరుగుతున్నది. ఈ అంశాలను తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. పార్టీ కమిటీలు కూడా లేకపోవడంతో ప్రభుత్వంపై పోరాడడం లేదన్న అభిప్రాయంలో ఆమె ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో జాగృతి నేతృత్వంలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ముమ్మరం చేయాలన్న ఆలోచనలో కవిత ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.
పార్టీ నుంచి మద్దతు లభించకపోయినా.. జాగృతికి అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు తదితర వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారని అంటున్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఇదే అంశాన్ని జాగృతి నేతలకు కవిత తేల్చి చెప్పారని తెలిసింది. పార్టీ నేతలు కలిసి వచ్చినా రాకపోయినా తమ పోరాటాన్ని మాత్రం కొనసాగించాలని, జాగృతి సైన్యం బలమేంటో చూపించాలని ఆమె స్పష్టం చేసినట్టు సమాచారం.
యూత్ టార్గెట్‌గా..
సింగరేణిలో బీఆర్ఎస్‌కు అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కీలకంగా వ్యవహరిస్తున్నది. ఆ విభాగాన్ని కవిత దగ్గరుండి చూసుకునేవారు. ఎన్నికలొచ్చినా ఆమె నేతృత్వంలోనే టీబీజీకేఎస్నేతలంతా నడిచేవారు. సింగరేణి పరిధిలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్జిల్లాల్లో కలిపి మొత్తం 26 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములపై సింగరేణి కార్మికుల ప్రభావం ఉంటుంది. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీబీజీకేఎస్ నేతలతో బీఆర్ఎస్ఎమ్మెల్యేలకు సంబంధాలు దెబ్బతిన్నాయనే వార్తలు వచ్చాయి. ఫలితంగానే ఆ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ఓడిపోయిందన్న వాదనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆ 26 నియోజకవర్గాల్లో మళ్లీ ప్రభావం చూపించాలంటే.. టీబీజీకేఎస్‌తో పాటు జాగృతి విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కవిత భావిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే సింగరేణి జాగృతి విభాగాన్ని ఏర్పాటు చేసి కోఆర్డినేటర్లను నియమించుకుని ముందుకు వెళ్లాలని ఆమె నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా యూత్‌ను జాగృతిలో పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయాల్సిందిగా నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
కార్మికుల సంక్షేమమే లక్ష్యం: కవిత
సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థను కాపాడడమే లక్ష్యంగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. టీబీజీకేఎస్‌తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందని చెప్పారు. సంస్థలో 40 వేల మంది కార్మికులు ఉండగా, వారిలో సగానికిపైగా యువతే ఉన్నారన్నారు. సింగరేణి నుంచి తరలివచ్చిన యువ కార్మికులతో మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ‘‘కాంగ్రెస్సర్కార్ అవినీతితో సింగరేణి సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతున్నది. ప్రధాని మోదీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారు. కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్కోడ్గురించి ఒక్క మాట కూడా సీఎం మాట్లాడడం లేదు. ఇకపై సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం.
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగ నియామకాలు జీఎం స్థాయిలోనే చేస్తారు. కానీ సీఎం తన పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ హైదరాబాద్‌కు పిలిపించి అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న మారు పేర్ల సమస్యను పరిష్కరించి వారికి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించాలి. సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యాబోధన చేయాలి. కార్మికులు, వాళ్ల కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలి.
అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలి” అని డిమాండ్ చేశారు. భూగర్భ గనుల్లో ఎస్డీఎల్ వెహికల్స్ సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా, ప్రైవేట్ వాళ్లతో నడిపిస్తున్నారని.. ఇది కార్మికులను తొలగించే కుట్ర అని మండిపడ్డారు. సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డీఎంఎఫ్‌టీ నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించుకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలకు తరలించుకుపోతున్నారని ఫైర్ అయ్యారు.
సింగరేణి జాగృతి కోఆర్డినేటర్లు వీరే..
బెల్లంపల్లి–కిరణ్ ఓరం, శ్రీరాంపూర్–కుర్మ వికాస్, మందమర్రి–ఎస్.భువన్, రామగుండం1– బొగ్గుల సాయికృష్ణ, రామగుండం2– కె. రత్నాకర్ రెడ్డి, రామగుండం3–దాసరి మల్లేశ్, భూపాలపల్లి–నరేశ్ నేత, మణుగూరు–అజ్మీరా అశోక్ కుమార్, కొత్తగూడెం–వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్, కార్పొరేట్– వసికర్ల కిరణ్ కుమార్, ఎస్‌టీపీపీ పవర్ ప్లాంట్–కె. రామ్మోహన్ చారి.
టీబీజీకేఎస్‌లో క్రమశిక్షణ కమిటీ..
ఎమ్మెల్సీ కవిత ‘సింగరేణి జాగృతి’ని ప్రకటించడం, ఈ మీటింగ్‌కు టీబీజీకేఎస్ నుంచి కొందరు హాజరుకావడంతో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ అలర్టెయింది. సంఘంలో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. యూనియన్ జనరల్ సెక్రటరీ సురేందర్‌రెడ్డి చైర్మన్‌గా, పలువురు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. యూనియన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఈ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కవిత సమావేశానికి హాజరైనవారిపై కమిటి ఏ చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.