అరెస్ట్​పై సుప్రీంలో కవిత పిటిషన్​

అరెస్ట్​పై సుప్రీంలో కవిత పిటిషన్​
  •  రిమాండ్​ ఉత్తర్వులను రద్దు చేయాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్,  రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు అక్రమమని, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈడీ  కీలు బొమ్మగా మారిందని ఆరోపించారు. ఈడీ అధికారులు పొలిటికల్ ఎజెండాతో పనిచేస్తున్నారని పిటిషన్​లో ప్రస్తావించారు. ఈడీ తీరును నిరసిస్తూ.. మొత్తం 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు మంగళవారం సుప్రీం కోర్టులో ఫ్రెష్ పిటిషన్ దాఖలు చేశారు. 

అయితే, విచారణ జాబితాలో ఈ పిటిషన్ నమోదు కాకపోవడంతో బుధవారం సీజేఐ బెంచ్ ముందు ఈ అంశాన్ని మెన్షన్ చేయనున్నట్టు అడ్వకేట్లు తెలిపారు. కాగా, సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేశారని కవిత పిటిషన్​లో ఆరోపించారు. ఏడాది కాలంగా తన పిటిషన్ పై జరిగిన వాదనలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ పిటిషన్​కు జత చేశారు. మహిళ అయినందున.. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ – 2022  సెక్షన్ 50(2) ప్రకారం రక్షణ ఉంటుందని పిటిషన్​లో పేర్కొన్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం కేసులో మహిళలను ఇంటివద్దనే విచారించాలన్న తీర్పు కాపీలను అటాచ్ చేశారు.   

ఈడీ కస్టడీ రాజ్యాంగ విరుద్ధం

సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్​లో ఉండగానే సోదాల పేరుతో హైదరాబాద్​లోని తన నివాసంలోకి వచ్చిన ఈడీ అధికారులు అక్రమంగా తనను అదుపులోకి తీసుకున్నారని పిటిషన్​లో కవిత ప్రస్తావించారు. కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్న తీరును వివరించారు. సుదీర్ఘ వాదనల అనంతరం తనకు ఈడీ కస్టడీకి అప్పగించారని తెలిపారు. అయితే ఈ కస్టడీ విధింపు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 21, 22(1) &(2) ప్రకారం విరుద్ధమని పేర్కొన్నారు. తుది తీర్పు వెలువడే వరకు పలు షరతులు విధిస్తూ.. తక్షణమే కవితను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

రిట్​ పిటిషన్ విత్ డ్రా

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత నిరుడు సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను మంగళవారం విత్ డ్రా చేసుకున్నారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు(అరెస్ట్) తీసుకోకుండా చూడాలంటూ కవిత నిరుడు మార్చి లో 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ దాఖలు చేశారు.  ఈడీ ఆఫీసుకు మహిళలను విచారణకు పిలవవచ్చా? అని ఇందులో సవాల్ చేశారు. ఏడాది కాలంగా పిటిషన్ వాయిదా పడుతూ వస్తున్నది. 

అమ్మను కలిసేందుకు అనుమతించండి

ఈడీ కస్టడీలో ఉన్న తనను కలిసేందుకు అమ్మ, పిల్లల కు అనుమతివ్వాలని కవిత రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తల్లి శోభ, కొడుకులు ఆదిత్య, ఆర్య,  చెల్లెళ్లు అఖిల సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డి ని కలుసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ మేరకు మంగళవారం కవిత తరఫు అడ్వకేట్లు పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్ పై ఈడీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఎక్కువమంది కలవడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం.. తల్లి, కొడుకు, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించింది.

అడ్వకేట్​తో కేటీఆర్​ భేటీ

కస్టడీలో ఉన్న కవితను మంగళవారం కేటీఆర్ ఒక్కరే కలిశారు. తొలిరోజైన ఆదివారం భర్త అనిల్, హరీశ్​రావుతో కలిసి కవితను కేటీఆర్ పరామర్శించారు. సోమవారం కేటీఆర్, హరీశ్​రావు వెళ్లగా.. మంగళవారం  మాత్రం కేటీఆర్ ఒక్కరే కలిసి మాట్లాడారు. లాయర్ మోహిత్ రావుతో భేటీ అయ్యి చట్ట పరంగా ఏవిధంగా ముందుకెళ్తున్నారో అడిగి తెలుసుకున్నారు.   సాయంత్రం5:30 గంటలకు వైద్యులు రోజువారీ సాధారణ వైద్య పరీక్షలు చేశారు.  కాగా, మంగళవారం విజిటింగ్ టైంలో మార్పులు జరిగాయి. 6 నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే  పలు కారణాల వల్ల కేటీఆర్, లాయర్ మోహిత్ రావు రాత్రి 7 గంటకు కవితను కలిశారు.

కవితను 4గంటలు ప్రశ్నించిన ఈడీ

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మూడో రోజు సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, సహ నిందితుల నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 10 :30 తర్వాత కవిత విచారణ ప్రారంభం అయింది. మధ్యాహ్నం 12:30 టైంలో అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మళ్లీ 3 గంట తర్వాత విచారణ ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ముగించారు. పాలసీ రూపకల్పన సందర్భంలో ఢిల్లీ, హైదరాబాద్ లోని హోటల్స్ లో జరిగిన మీటింగ్ లు, సౌత్ గ్రూప్ సభ్యుల ఫోన్లలో దొరికిన కీలక ఆధారాలపై ప్రశ్నించింది. 

ముఖ్యంగా రూ.100 కోట్ల ముడుపులను ఆప్ నేతలకు చేరవేతపై ఆరా తీసినట్లు తెలిసింది. గోవా, పంజాబ్ ఎన్నికలకు ఈ నిధులు మళ్లించిన విషయంపై ఆమె స్టేట్​మెంట్ ను రికార్డు చేసినట్లు సమాచారం. అలాగే బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లితో మీటింగ్ లు, కాల్ డేటా, చాట్స్ పై వాంగ్మూలం తీసుకున్నారు. ఇందులో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన కవిత, కొన్ని అంశాలు తనకు సంబంధం లేదన్నారు.