కేసీఆర్‌‌‌‌ దత్తత గ్రామం‌‌లో భూసమస్య అట్లనే ఉన్నది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసీఆర్‌‌‌‌ దత్తత గ్రామం‌‌లో భూసమస్య అట్లనే ఉన్నది :  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • లక్ష్మాపూర్‌‌‌‌ గ్రామాన్ని సర్వే చేసి నక్ష తయారు చేస్తే..   భూ సమస్యలు ఇంకా పెరిగినయ్‌‌: కవిత
  • ధరణిలో ఐదెకరాల భూమి ఎకరం.. ఎకరం ఉంటే పావు ఎకరం పడింది
  • ఇప్పటికీ గ్రామ రైతుల కష్టాలు తీరలే
  • వారి తరఫున జాగృతి పోరాడుతుందని వెల్లడి

శామీర్ పేట/జవహర్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు:  కేసీఆర్‌‌‌‌ దత్తత గ్రామం లక్ష్మాపూర్‌‌‌‌లో భూ సమస్యలు ఇంకా అట్లనే ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీంతో రావాల్సినంత రైతు బంధు రాక ఇక్కడి రైతులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ఆదివారం జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా  మాజీ సీఎం కేసీఆర్​ దత్తత గ్రామమైన మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలోని లక్ష్మాపూర్‌‌ గ్రామం‌‌లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పర్యటన సందర్భంగా లక్ష్మాపూర్​గ్రామంలో ఆగిన  కేసీఆర్..అక్క నక్ష సరిగ్గా లేదని, దాన్ని సరిచేస్తామని చెప్పారు. 

ఇలాంటి గ్రామాల సమస్యలు పరిష్కరించేందుకే ధరణి తీసుకువస్తున్నామని అసెంబ్లీలో కూడా ప్రకటించారు. లక్ష్మాపూర్‌‌‌‌కు శాటిలైట్​ సర్వే చేయించి.. ధరణి ద్వారా నక్ష కూడా చేశారు. అయితే, ఈ సర్వేలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐదెకరాల రైతుకు ఎకరం, రెండు ఎకరాల రైతుకు పావు ఎకరం ఉన్నట్లు ధరణిలో పడింది. పట్టా భూములను సైతం లావణి భూములుగా రికార్డుల్లో రాశారు. 

దీంతో రైతులకు ఎప్పుడూ రావాల్సినంత రైతుబంధు రాలేదు. కేసీఆర్ తప్పు చేశారు కాబట్టి సరిచేస్తామని ఇప్పటి సీఎం రేవంత్‌‌ చెప్పారు. లక్ష్మాపూర్‌‌‌‌కు వచ్చి ఇక్కడ ఉండి వారికి హామీ ఇచ్చారు. ధరణి గంగలో కలిపి భూమాత తెస్తున్నామని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఏమీ చేయలేదు. లక్ష్మాపూర్‌‌‌‌లో ఉన్న భూసమస్యలన్నీ పరిష్కరించాలి’’ అని డిమాండ్ చేశారు. సమస్య తీరే వరకు పోరాటం చేస్తామన్నారు.

నాది ముళ్లబాట 

తాను నడుస్తున్న దారి పూల బాట కాదని.. ముళ్ల బాట అని  తెలుసని కవిత అన్నారు. ఎన్ని సవాళ్లు, సమస్యలు ఎదురైనా ప్రజల వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ‘‘20 ఏండ్లు పని చేసిన పార్టీ నన్ను బయటకు పంపింది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జాగృతి జనంబాటలో మీ మధ్యకు వచ్చా’’ అని అన్నారు.  ఒక సోదరిగా వెన్నంటి ఉండి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. 

జవహర్‌‌‌‌నగర్‌‌‌‌లో పర్యటన..

మేడ్చల్​సమస్యలకు నిలయంగా మారిందని  కవిత అన్నారు.  ఆమె జవహర్‌‌‌‌నగర్‌‌‌‌ కార్పొరేషన్‌‌లో డంపింగ్‌‌ యార్డును పరిశీలించారు.  డ్వాక్రా మహిళా సంఘాలతో బస్తీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాలు, పూలు అమ్మి పైకొచ్చానని గొప్పలు చెప్పడమే తప్పితే మేడ్చల్ అభివృద్ధిని ఎమ్మెల్యే మల్లారెడ్డి గాలికొదిలేశారని, అక్రమ ఆస్తులు పెంచుకోవడంలో తెలంగాణలోనే నెంబర్ వన్‌గా  నిలిచారని అన్నారు. ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్​ చేశారు.