పోలీసులను నడిపించే నాలుగో సింహమే సీఎం కేసీఆర్: కవిత

పోలీసులను నడిపించే నాలుగో సింహమే సీఎం కేసీఆర్: కవిత
  •     ఆడపిల్లలకు సర్కార్‌‌‌‌  అండగా ఉంది: ఎమ్మెల్సీ కవిత
  •     ట్యాంక్‌‌బండ్‌‌పై సురక్షా సంబురాలు
  •     పాల్గొన్న పలువురు ప్రముఖులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళల భద్రత బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మనకు కనిపిస్తున్న పోలీసులు మూడు సింహాలైతే కనబడకుండా వెనుకుండి వాళ్లను నడిపించే నాలుగో సింహమే సీఎం కేసీఆర్ అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హోంశాఖ ఆదివారం ట్యాంక్‌‌బండ్‌‌పై నిర్వహించిన మహిళా సురక్షా దినోత్సవంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, సత్యవతి రాథోడ్‌‌తో కలిసి కవిత పాల్గొన్నారు. తర్వాత ఆమె మాట్లాడుతూ, ఆడ బిడ్డల భద్రతకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే తాటతీస్తామన్న సందేశాన్ని ఇచ్చి ఈ టీమ్‌‌లను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ స్ఫూర్తితో 18 రాష్ట్రాల్లో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని కవిత వెల్లడించారు. పోలీసులు అందిస్తున్న భద్రతతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్నారు.

రాష్ట్రంలో ఎక్కడైనా ఆడ పిల్లలు అర్ధరాత్రి కూడా రోడ్లపై నడిచే పరిస్థితి ఉందన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌‌ వెహికల్స్‌‌తో ట్యాంక్‌‌ బండ్‌‌ నుంచి చార్మినార్‌‌‌‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే, షీ టీమ్స్‌‌పై రూపొందించిన ‘కవచ్ ఫర్ విమెన్’షార్ట్ ఫిల్మ్‌‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మేయర్ గద్వాల​విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్‌‌‌‌, ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శిఖా గోయల్, హైదరాబాద్ సీసీ సీవీ ఆనంద్, సినీ నటుడు నాని, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు.