
సిద్దిపేట రూరల్, వెలుగు: తన కుటుంబంలో గొడవలు పెట్టి తల్లిని, పిల్లను వేరు చేశారని.. కచ్చితంగా వాళ్ల భరతం పడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం తన సొంతూరైన సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘‘2005కు ముందు నేను ఎన్నోసార్లు చింతమడక గ్రామానికి వచ్చి వెళ్లేదాన్ని. ఆ తర్వాత ఉద్యమంలో బిజీగా మారి ఇక్కడికి రాలేకపోయాను. ఆనాటి నుంచి ఈనాటి దాకా సిద్దిపేటకు రావాలన్నా, చింతమడకకు రావాలన్నా ఎన్నో ఆంక్షలు విధించారు. ఇదే చింతమడక గడ్డ మీద పుట్టిన కేసీఆర్.. ఇక్కడి ప్రజల అండదండలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రాన్ని సాధించారు.
ప్రజలకు సుపరిపాలన అందించారు. కానీ కేసీఆర్ చాటున కొందరు అక్రమాలకు పాల్పడి, చంద్రుడి లాంటి ఆయనకు మచ్చ తీసుకొచ్చారు. ఈ విషయాన్ని నేను బయటపెట్టినందుకు నా కుటుంబంలో గొడవలు పెట్టి తల్లిని, పిల్లను వేరు చేశారు. కచ్చితంగా వాళ్ల భరతం పడతాను” అని అన్నారు. ‘‘నేను సిద్దిపేటకు, చింతమడకకు రాకుండా ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. ఆంక్షలు పెడితే ఒక్కసారి కాదు.. వందసార్లు వచ్చి నా సత్తా చూపిస్తాను. చింతమడక నా జన్మభూమి. రానున్న రోజులు కర్మ భూమి కావొచ్చు. గ్రామ ప్రజలంతా నాకు అండగా నిలవాలి” అని కోరుతూ కవిత కంటతడి పెట్టారు.