- 27, 28వ తేదీల్లో వాదనలు వింటామన్న ఢిల్లీ హైకోర్టు
- కవిత పాత్రపై జూన్ 7నచార్జ్ షీట్ వేస్తాం: సీబీఐ
- 50 మందిలో కవిత ఒక్కరే మహిళ
- ఆమెకు బెయిల్ఇవ్వాలి: విక్రమ్ చౌదరి
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈ నెల 27, 28వ తేదీల్లో వాదనలు వింటామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా బెయిల్ పిటిషన్లపై సోమవారం సీబీఐ, కవిత తరఫున వాదనలు వింటామని పేర్కొంది. అలాగే మంగళవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించింది. లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు, అలాగే ట్రయల్ కోర్టు తనను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి అనుమతి, కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ మెంబర్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈడీ తరఫున అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్, సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్, కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి హాజరయ్యారు. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసినట్లు జోహెబ్ హుస్సేన్ కోర్టుకు నివేదించారు. సీబీఐ కేసులో కవిత పిటిషన్ పై శనివారం కౌంటర్ దాఖలు చేస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ విన్నవించారు. లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై జూన్ 7న సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు తెలిపారు.
నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ
లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్ షీట్లలో మొత్తం 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టాలను పరిగణనలోకి తీసుకొని ఆమెకు బెయిల్ ఇవ్వాలని సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత అరెస్టులో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని, వీటిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఆ కేసు జులైకి వాయిదా పడిందన్నారు. ఈలోపు ఈడీ, సీబీఐ కేసుల్లో ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయని, అందుకే కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కేసులో సుదీర్ఘ వాదనలు చేయాల్సి ఉన్నందున మరింత సమయం పడుతుందని కోర్టుకు విన్నవించారు. దీంతో సీబీఐ తన కౌంటర్ కాపీని ఆదివారం రాత్రి 10లోపు కవిత అడ్వకేట్లకు ఇవ్వాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
కవితతో భర్త అనిల్ ములాఖత్
తీహార్ జైలులో ఉన్న కవితతో శుక్రవారం ఆమె భర్త అనిల్ ములాఖత్ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో జరిగిన వాదనల తీరును ఆమెకు వివరించారు. అలాగే, జైలులో కవిత పరిస్థితుల గురించి అనిల్ అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం యావరేజ్ గా 45 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. అధిక వేడితో జైలులో ఇబ్బంది అవుతోందని ఆమె భర్త దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
