- ఆహారమున్నా.. తోడు దొరకక వెనుదిరుగుతున్న పెద్ద పులులు
- కవ్వాల్ లో 35 నుంచి 41 పులులకు ఆవాసం కల్పించే చాన్స్
- వన్యప్రాణి నిపుణుడు ఇమ్రాన్ సిద్ధిఖీ అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పులుల నివాసానికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అన్ని విధాలా అనుకూలంగా ఉన్నా.. కొన్ని అడ్డంకులతో అవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. కవ్వాల్ అడవుల్లో ప్రస్తుతం ఉన్న ఆహారం (ప్రే బేస్) ప్రకారం.. సుమారు 35 నుంచి 41 పులులకు ఆవాసం కల్పించవచ్చని పరిశోధనలో తేలింది. ఆహారం దొరుకుతున్నా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పులులకు కారిడార్ ప్రధాన సమస్యగా మారింది.
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పులులకు రోడ్లు, రైల్వే లైన్లు, బొగ్గు గనులు, గోదావరి ప్రరీవాహకం ఉండటం ప్రతిబంధకంగా మారుతున్నాయి. కవ్వాల్ అభయారణ్యంలో సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ (సీడబ్ల్యూఎస్), హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి చెందిన ఇమ్రాన్ సిద్ధిఖీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. 12 ఏండ్లపాటు చేసిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కారిడార్లు క్లోజ్..
మహారాష్ట్ర నుంచి పులులు కవ్వాల్‌కు రావాలంటే ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మహారాష్ట్రలోని తడోబా-అంధారి వంటి ప్రాంతాల నుంచి పులులు కవాల్‌కు రావాలంటే హైవేలు, రైల్వే నెట్‌వర్క్, ఓపెన్ కాస్ట్ గనులు, నివాసాలు అడ్డుగా ఉన్నాయి. గత పదేండ్లలో సుమారు 15 పులులు కవ్వాల్ రిజర్వ్‌లోకి వచ్చి వెళ్లాయి. కానీ, స్థిరంగా ఉండటం లేదు. అంతేకాదు, అడవి మధ్యలో ఉన్న గ్రామాలు, పశువుల కాపరులతో ఘర్షణలు పులుల రాకకు ఆటంకంగా మారుతున్నాయి.
మహారాష్ట్రలోని తాడోబా వంటి రిజర్వ్‌ల నుంచి పులులు కవ్వాల్‌కు రావడానికి ఉపయోగపడే కారిడాడర్లు మూసుకుపోతున్నాయి. కోర్ ఏరియాలోని 30 గ్రామాల ఉనికి, పశువుల మేత, అక్రమ వేట వంటివి అంశాలు కూడా పులుల స్థిర నివాసంపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. వేట కోసం కుక్కలను ఉపయోగించడం, పశువుల ద్వారా వన్యప్రాణులకు వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉందని అధ్యయనం హెచ్చరించింది.
కవ్వాల్ లో పులులు ఆవాసం ఉండాలంటే.. ఆహార లభ్యత పెంచితే సరిపోదని, వాటికి అనువైన వాతావరణ సృష్టించాలని వన్యప్రాణి నిపుణులు సూచిస్తున్నారు. కవ్వాల్ అడవుల్లో దుప్పి, సాంబార్, నీల్గాయ్, చౌసింగా, అడవి పందుల సంఖ్య గణనీయంగా ఉందని, కేవలం కోర్ ఏరియాలోనే 35కు పైగా పులులకు సరిపడా ఆహారం అందుబాటులో ఉందని ఈ స్టడీ వెల్లడించింది.
ఇలా చేస్తే మేలు..
వన్యప్రాణుల రాకపోకలకు ఆటంకం లేకుండా రహదారుల వద్ద అండర్ పాస్ లు నిర్మించాలి. సంతానోత్పత్తి జనాభాను స్థాపించడానికి ఇతర రిజర్వ్‌ల నుంచి ఆడ పులులను తీసుకొచ్చి ఇక్కడ వదలాలి. స్థానిక ప్రజల్లో పులుల పట్ల ఉన్న వ్యతిరేకతను పోగొట్టి, వారిని పరిరక్షణలో భాగస్వాములను చేయాలి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యవేక్షణలో కొన్ని ఆడ పులులను నేరుగా కవ్వాల్ అడవుల్లోకి వదలాలి.
కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ వంటి ప్రాంతాల్లో పులులు దాటడానికి వీలుగా హైవేలపై ఓవర్‌పాస్‌లు లేదా అండర్‌పాస్‌లు నిర్మించాలి. అడవిపై ఆధారపడిన సుమారు 30 గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి, వన్యప్రాణులతో కలిసి జీవించేలా ప్రోత్సహించాలి. వన్యప్రాణుల వేటను అరికట్టడం, కారిడార్లను బలోపేతం చేయడం ద్వారానే కవ్వాల్‌ను తిరిగి పులుల సామ్రాజ్యంగా మార్చవచ్చు.
వన్యప్రాణి నిపుణుడు ఇమ్రాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. పేపర్ మీద రక్షణ కల్పిస్తే సరిపోదని.. క్షేత్రస్థాయిలో పులులు స్వేచ్ఛగా తిరిగేలా చూడాలన్నారు. కవ్వాల్ లో స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఆదివాసీ, గిరిజనుల సహకారంతోనే పులులను కవ్వాల్‌కు రప్పించవచ్చని తద్వారా అడవి రక్షణగా ఉంటుందన్నారు.
పులులు వస్తేనే.. అడవికి కళ
అడవికి రాజు.. వేటలో రారాజు పులి. అరణ్యంలో టైగర్ల సందడి ఉంటే ఆ ఫారెస్ట్‌కు కళ ఉంటుంది. ఆ రాష్ట్రానికి గౌరవంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఆదాయం పెరగడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. అయితే, కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులులకు ప్రధాన ఆహారమైన చిటాల్ (దుప్పి)ల సాంద్రత గణనీయంగా పెరిగింది. 2010లో చదరపు కిలోమీటరుకు కేవలం 1.94గా ఉన్న వీటి సంఖ్య, 2022 నాటికి 6.08కి చేరింది. శాస్త్రీయ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం కవ్వాల్‌లోని 893 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా సుమారు 35 నుంచి 41 పులులకు ఆవాసం కల్పించగలదు.
2010 నాటి సామర్థ్యం (24 పులులు)తో పోలిస్తే ఇది భారీ పురోగతి. అయినప్పటికీ, అక్కడ పులుల సంతతి వృద్ధి చెందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పులుల జనాభా పెరగకపోవడానికి ప్రధాన కారణం ‘సంతానోత్పత్తి’ చేసే జనాభా లేకపోవడమే. గడిచిన దశాబ్ద కాలంలో సుమారు 15 పులులు కవ్వాల్‌లోకి ప్రవేశించినట్టు రికార్డులు చెబుతున్నా.. అందులో కేవలం రెండే రెండు ఆడ పులులు ఉన్నాయి. తగినన్ని ఆడ పులులు లేకపోవడంతో వచ్చిన మగ పులులు కూడా అక్కడ ఉండకుండా వెనుదిరిగిపోతున్నాయి.
