- సరోగసి కేసు క్వాష్ చేయడానికి నిరాకరణ
న్యూఢిల్లీ, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధాన సూత్రధారి డాక్టర్ నమ్రతకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ కేసును క్వాష్ చేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. తన అరెస్టు, రిమాండ్‌ను సవాల్ చేస్తూ నమ్రత దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. నిందితురాలు ఒక మహిళా డాక్టర్ అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా.. న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది.
కింది కోర్టు విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయపరమైన సాధారణ ప్రక్రియను అనుసరించకుండా, కింది కోర్టులో బెయిల్ లేదా డిశ్చార్జ్ పిటిషన్ వేయకుండా ఇక్కడికి రావడం సరికాదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అరెస్టు సమయంలో ఆర్టికల్ 22 నిబంధనలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు.
అరెస్టు కారణాలను లిఖితపూర్వకంగా నిందితురాలికి అందించలేదని, కనీస ఆధారాలు లేకుండానే మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారని పేర్కొన్నారు. అయితే, తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లదల్చుకోలేదని ధర్మాసనం స్పష్టం చేయడంతో న్యాయవాది తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలో.. హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలు ట్రయల్ కోర్టులో బెయిల్ పొందేందుకు అడ్డంకిగా మారకూడదని కోరగా, సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. కింది కోర్టు స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, హైకోర్టు వ్యాఖ్యల ప్రభావం బెయిల్ విచారణపై ఉండదని స్పష్టం చేస్తూ కేసును ముగించింది.
