కాజీపేటలో 48.9 డిగ్రీలు.. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక టెంపరేచర్

కాజీపేటలో 48.9 డిగ్రీలు.. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక టెంపరేచర్
  • 1952లో భద్రాచలంలో 48.6 డిగ్రీలు
  • 7 జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శుక్రవారం ఎండలు మండిపోయాయి. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా శుక్రవారం ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండ జిల్లాలోని కాజీపేటలో అత్యధికంగా 48.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ఇప్పటిదాకా తెలంగాణలో నమోదైన అత్యధిక టెంపరేచర్. ఇంతకుముందు1952లో భద్రాచలంలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు రికార్డులు చెప్తున్నాయి. 

కాజీపేటలో 48.9 డిగ్రీలు

తాజాగా అంతకుమించిన టెంపరేచర్ రికార్డ్ అయింది. ఇక, రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండతో పాటు కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్​భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదయ్యాయి. మరో 9 జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల మధ్య రికార్డ్ అయ్యాయి. కరీంనగర్ జిల్లా తంగులలో 47.1, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 46.5, పమ్మి, బాణాపురాల్లో 46.2, సత్తుపల్లిలో 45.8, కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా జంబుగ, భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్​లలో 45.7, యనంబైలులో 45.6, కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.3, జయశంకర్​జిల్లా మహదేవ్​పూర్, 

జనగామ జిల్లా జాఫర్​గఢ్​లలో 45.2, భద్రాద్రి జిల్లా అశ్వాపురం, కుమ్రంభీం జిల్లా కుంచవెల్లిల్లో 45.1, భద్రాద్రి జిల్లా బయ్యారంలో 45 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. అయితే, శనివారం టెంపరేచర్లు కాస్తంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మాత్రం వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది.