కంటిచూపు లేకున్న కాన్ఫిడెన్స్ పాతికలక్షలు గెలిచింది

కంటిచూపు లేకున్న కాన్ఫిడెన్స్  పాతికలక్షలు గెలిచింది

కౌన్​బనేగా కరోడ్​పతి (కేబీసీ) షోలో కోటి రూపాయలు గెలిచిన వాళ్ల గురించే సాధారణంగా మాట్లాడుకుంటుంటారు. కానీ, పాతిక లక్షల రూపాయలు గెలిచిన ఈమె గురించి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. కంటి చూపు సరిగా లేకపోయినా ఏమైనా చేయగలనన్న కాన్ఫిడెన్స్ ఆమెలో ఉండటమే అందుకు కారణం. ఆ కాన్ఫిడెన్స్​తోనే కేబీసీ 14వ  సీజన్​లో పోటీపడింది. లాజికల్ రీజనింగ్ స్కిల్స్​తో అమితాబ్​తో పాటు ఆడియెన్స్ మనసు గెలుచుకుంది. పేరు అనేరి ఆర్య. సూరత్​కి  చెందిన ఈమె అసిస్టెంట్ ప్రొఫెసర్. 

స్పెషల్​ కంటెస్టెంట్​గా కేబీసీ 14వ సీజన్​లో అడుగుపెట్టింది అనేరి. మొదటి రౌండ్ నుంచే.. కష్టమైన ప్రశ్నలు అడిగినా కంగారు పడకుండా సమాధానం చెప్పింది. 1967లో మహారాష్ట్రలో చేరతారా? లేదా? అని నిర్వహించిన రెఫరెండంలో  ఏ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు?  అనే ప్రశ్నకు ఎ) బెలగావి  బి) కచ్​ సి) గోవా డి) జునాగఢ్.. నాలుగు​ ఆప్షన్లు ఇచ్చారు. వాటిలో  ‘గోవా’ కరెక్ట్ ఆన్సర్​ చెప్పి. యాభై లక్షల ప్రశ్న వరకు వెళ్లింది. అయితే లైఫ్​లైన్స్​ లేకపోవడంతో అంతటితో ఆపేస్తానని చెప్పింది అనేరి. దాంతో అమితాబ్​ ఆమెకు రూ.25 లక్షల ప్రైజ్​ మనీ ఇచ్చారు.

చిన్నప్పటి నుంచి..

చూపు సరిగా లేని అనేరికి బ్రెయిలీ లిపిలో కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ సాఫ్ట్​వేర్ సాయంతో చదవడం, రాయడం నేర్పించారు తల్లిదండ్రులు. వాళ్ల ప్రోత్సాహంతో డిగ్రీ చేసింది అనేరి. ప్రొఫెసర్​ అవ్వాలని పీహెచ్​డీ చేసింది. ప్రస్తుతం సూరత్​లోని శ్రీ భాయ్​కాక సోచిత్ర గవర్నమెంట్ ఆర్ట్స్​ అండ్​ సైన్స్ కాలేజీలో ఇంగ్లీష్​ పాఠాలు చెప్తోంది.  చిన్నప్పటి నుంచి క్విజ్​ ప్రశ్నలకు చకచకా సమాధానం చెప్పేది అనేరి. దాంతో ఆమెని కౌన్ బనేగా కరోడ్​పతి షోకి తీసుకెళ్లాలి అనుకున్నారు తల్లిదండ్రులు. వాళ్లు అనుకున్నట్టుగానే కేబీసి 14వ సీజన్​లో పార్టిసిపేట్​ చేసే అవకాశం వచ్చింది.  

బ్లాక్ సినిమా ఇష్టం

ఆమెకు బాగా ఇష్టమైన సినిమా 2005లో హిందీలో వచ్చిన ‘బ్లాక్​’. ఎందుకంటే.. ఆమె జీవితానికి చాలా దగ్గరగా ఉన్న సినిమా అది. అందులో వినికిడి లోపంతో పాటు కంటిచూపు లేని అమ్మాయిగా రాణీముఖర్జీ, ఆమెని సపోర్ట్​ చేసే టీచర్​గా అమితాబ్ బచ్చన్​ నటించారు. తాను పీహెచ్​డీ చేస్తున్నప్పుడు గైడ్​గా ఉన్న  సునీల్ షా టీచర్​ తనకు చాలా  సాయం చేసి, ప్రోత్సహించాడని గుర్తు చేసుకుంది అనేరి. అంతేకాదు తనకు అండగా ఉన్న తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పింది.  

ఇంకా చదువుకుంటా

‘‘అమితాబ్​ సార్ పాతిక లక్షలు గెలిచావని చెప్పగానే నమ్మాలనిపించలేదు. ఆ తర్వాత అర్థమైంది... నేను సరైన సమాధానం చెప్పానని. ఆ క్షణం జీవితంలో ఎదుర్కొన్న సమస్యలన్ని ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలాయి. ఆ మూమెంట్​ని ఎప్పటికీ మర్చిపోలేను. నా చదువు కోసం అమ్మానాన్న చేసిన అప్పులు గెలిచిన డబ్బుతో తీర్చేస్తా. అంతేకాదు ఈ ప్రైజ్​ మనీతో పై చదువులకి వెళ్లాలన్న నా కల కూడా నెరవేరుతుంది” అని చెప్పింది అనేరి.