
- నిరుటిలాగే కొంటామని వెల్లడి
- సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో నిర్ణయం!
- సివిల్ సప్లైస్‌కు 20 వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీతో కొనుగోళ్లు
- తాలు లేకుండా, తేమ 17 శాతం మించకుండా వడ్లు తెండి
- మద్దతు ధర పొందేందుకు రైతులు రూల్స్ పాటించాలన్న సీఎం
హైదరాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై సర్కారు దిగొచ్చింది. నిరుటిలాగే ఊర్లల్లోనే వడ్లు కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సివిల్ సప్లైస్ ద్వారా వడ్లు కొనేది లేదని రెండ్రోజుల కిందట అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన ఆయన తాజాగా వెనక్కి తగ్గారు. ఐకేపీ సెంటర్లను ఎత్తేస్తామనడంపై రైతుల నుంచి వ్యతిరేకత రావడం, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పంట కొనుగోళ్లపై మంత్రులు, అధికారులతో సోమవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమీక్షించారు. యాసంగిలో పండించిన వడ్లు కొనేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు వెంటనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
20 కోట్ల గన్నీ బ్యాగులు రెడీ చేయండి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతుల ప్రయోజనాల కోసమే గతేడాది మాదిరిగా ఈసారి కూడా గ్రామాల్లోనే వడ్లు కొంటామని, ఇందుకోసం సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు రూ.20 వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రానికి పూర్తి చేయాలని ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావును ఆదేశించారు. పర్చేజ్ సెంటర్ల ఏర్పాటుపై కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌కు సూచించారు. వడ్ల కొనుగోళ్ల కోసం 20 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధం చేయాలన్నారు. రైతులు వడ్లు ఎండబోసి తాలు లేకుండా, తేమ 17 శాతానికి మించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు. కనీస మద్దతు ధర పొందేందుకు నిబంధనలను పాటించాలన్నారు.
పత్తి, కంది సాగు ఇంకింత పెంచాలి
వచ్చే వానాకాలంలో పత్తి, కంది పంటల సాగు మరింత పెంచాలని అధికారులతో సీఎం చెప్పారు. ఇక్కడ పండే పత్తికి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మంచి ధర వచ్చే అవకాశముందని అన్నారు. వానాకాలం సీజన్‌లో 75 లక్షల నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి రైతులు సిద్ధం కావాలన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో కంది సాగు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వేరుశనగ, ఆయిల్‌పామ్ సాగు లాభదాయకంగా ఉందని, వాటిపైనా రైతులు దృష్టి పెట్టాలని కోరారు.
గోదాములకు స్థలాలు గుర్తించండి
సాగునీటి వసతి పెరగడంతో రానున్న రోజుల్లో వరి పంట దిగుబడి మరింత పెరిగే అవకాశముందని, కాబట్టి అదనపు గోదాములు నిర్మించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇందుకు సిద్ధంగా ఉందని, సంస్థకు లీజుకు ఇచ్చేందుకు స్థలాలను గుర్తించాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అగ్రికల్చర్, మార్కెటింగ్, సివిల్ సప్లైస్ శాఖలు సమన్వయం చేసుకొని రైతులకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీలు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, జనార్దన్‌రెడ్డి, సీఎంవో సెక్రటరీ భూపాల్‌రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్‌సీఐ జీఎం అశ్వినీగుప్తా పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ స్టేజ్ 2 చివరి భూములకు నీళ్లివ్వాలి
కరీంనగర్ ఈఎన్సీకి సీఎం ఆదేశం
ఎస్సారెస్పీ స్టేజ్-2 పరిధిలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని చివరి భూములకు నీళ్లివ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. లోయర్ మానేరు డ్యామ్ నుంచి కాకతీయ కాల్వకు నీటిని విడుదల చేసి డీబీఎం 71 పరిధిలో ఉన్న సూర్యాపేట జిల్లాకు నీటిని అందించాలన్నారు. సోమవారం కరీంనగర్ ఈఎన్సీ శంకర్‌తో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. యాసంగి పంటలకు సరిపడా నీళ్లు అందడం లేదని అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రైతులు సాగు చేసిన ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోవడానికి వీళ్లేదన్నారు. వారి పొలాలకు నీళ్లివ్వాలని సూచించారు.
1.38 కోట్ల టన్నుల దిగుబడి
యాసంగి సీజన్‌లో రైతులు 52.76 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. ఈసారి 1.17 కోట్ల టన్నుల దొడ్డు వడ్లు, 21 లక్షల టన్నుల సన్న వడ్లు కలిపి సుమారు 1.38 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2,131 ఐకేపీ కేంద్రాలు.. 3,964 పీఏసీఎస్ కేంద్రాలు, 313 ఇతర కేంద్రాల ద్వారా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయనుంది.