సిట్ ఎంక్వైరీని పెద్దగా పట్టించుకోవద్దు!మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టండి: కేసీఆర్

సిట్ ఎంక్వైరీని పెద్దగా పట్టించుకోవద్దు!మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టండి: కేసీఆర్
  •     విచారణకు పిలిస్తే వెళ్దాం.. ప్రస్తుతం మున్సిపల్​ ఎన్నికలపై ఫోకస్ పెట్టండి!
  •     కేటీఆర్, హరీశ్​ రావుకు కేసీఆర్​ సూచన.. ఎర్రవల్లిలో ఫామ్​హౌస్​లో భేటీ
  •     విచారణ పేరుతో మున్సిపల్​ ఎన్నికల నుంచి డైవర్ట్​ చేసే ఎత్తుగడ
  •     కోల్​ బ్లాక్​ స్కామ్​ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  •     సిట్​ ఎంక్వైరీ జరిగిన తీరు, అడిగిన ప్రశ్నలపై కేసీఆర్​ ఆరా

హైదరాబాద్, వెలుగు: సిట్​విచారణపై ఎక్కువ ఫోకస్​పెట్టకుండా.. మున్సిపల్​ఎన్నికలపై దృష్టి సారించాలని కేటీఆర్, హరీశ్​రావుకు మాజీ సీఎం, బీఆర్ఎస్​ చీఫ్​కేసీఆర్​సూచించినట్టు తెలిసింది. సిట్​విచారణ పేరుతో ప్రభుత్వం ఎన్నికల నుంచి డైవర్ట్​ చేసే ఎత్తుగడలు వేస్తున్నదని, దానిని పెద్దగా పట్టించుకోవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం. శనివారం ఆయన ఎర్రవల్లి ఫాంహౌస్​లో కేటీఆర్, హరీశ్​ రావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సింగరేణి బొగ్గు టెండర్లు, సిట్​ విచారణ, మున్సిపల్​ ఎన్నికల సన్నద్ధతపై ఇద్దరితో సుదీర్ఘంగా చర్చించారు. నైనీ కోల్​ బ్లాక్​ టెండర్​ వ్యవహారంలో మాట్లాడిన నేపథ్యంలోనే హరీశ్​ రావు, కేటీఆర్​కు నోటీసులు ఇచ్చారని బీఆర్​ఎస్​ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ విషయాల గురించి కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. విచారణ జరిగిన తీరు, సిట్​ అధికారులు అడిగిన ప్రశ్నలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కేసీఆర్​ను కూడా విచారణకు పిలుస్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించినట్టు తెలిసింది. విచారణకు పిలిస్తే హాజరవ్వాలని.. అంతేకానీ దానిపై అతిగా స్పందించవద్దని కేటీఆర్, హరీశ్​ రావుకు సూచించారని తెలిసింది. అంతేకాకుండా నైనీ కోల్​ బ్లాక్​ టెండర్ల విషయంలో.. 2018లోనే (బీఆర్​ఎస్​) హయాంలోనే సైట్​ విజిట్ నిబంధన వచ్చిందన్న కాంగ్రెస్​ నేతల వ్యాఖ్యలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. 

మున్సిపోల్స్ నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం..

ప్రస్తుతం కోల్​ బ్లాక్​ స్కామ్​తో పాటు త్వరలో జరగబోయే మున్సిపల్​ఎన్నికల నుంచి డైవర్ట్​ చేసేందుకే ఇలాంటి సిట్​ విచారణలతో ప్రభుత్వం డ్రామాలు చేస్తున్నదని కేసీఆర్​ చెప్పినట్టు సమాచారం. ప్రజల దృష్టిని మళ్లించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పినట్టు తెలిసింది. ఇటు సిట్​ మరకను రుద్ది మున్సిపల్​ ఎన్నికల కసరత్తులో వెనకబడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పినట్టు తెలిసింది. కాబట్టి, మున్సిపల్​ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచేలా కసరత్తు చేయాలని సూచించినట్టు సమాచారం. ముందుగా మున్సిపాలిటీల వారీగా ఇన్​చార్జీలను నియమించుకోవాలని, ఎక్కడికక్కడ గట్టిగా కో ఆర్డినేట్​ చేసుకోవాలని దిశానిర్దేశం చేశారని తెలిసింది. ప్రజల్లోకి వెళ్లేటప్పుడు కాంగ్రెస్​ నెరవేర్చని హామీలను వివరించాలని చెప్పారు. అంతేకాకుండా.. సింగరేణిలో ప్రస్తుతం నడుస్తున్న స్కామ్​ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్టు సమాచారం. అధికారంలో లేకపోయినా సర్పంచ్​ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, మున్సిపల్​ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని కేటీఆర్, హరీశ్​కు కేసీఆర్​ సూచించినట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగా ప్రచార వ్యూహాలను రూపొందించాలన్నారు.

మున్సిపల్​ ఎన్నికలకు ఇన్​చార్జ్‌‌ల నియామకం

కేసీఆర్​తో భేటీ పూర్తయిన వెంటనే కేటీఆర్.. మున్సిపల్​ ఎన్నికలకు బల్దియాల వారీగా ఇన్​చార్జ్‌‌లను నియమించారు. 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లకు వాళ్లను నియమించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడంతో పాటు స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఎన్నికల వ్యూహాల రూపకల్పన బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మున్సిపాలిటీల్లోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతనూ వారికే అప్పగించారు.