కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్టు

కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్టు
  • భూకబ్జా కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు 
  • 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
  • చర్లపల్లి జైలుకు తరలింపు

ఎల్బీనగర్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్​కన్నారావును హైదరాబాద్ లోని ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. మన్నెగూడ భూకబ్జా కేసులో ఆయనను మంగళవారం గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ప్రిన్సిపాల్ జూనియర్, 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, కన్నారావును చర్లపల్లి జైలుకు తరలించారు. 

కాగా, అంతకుముందు ఆదిభట్ల సీఐ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత నెల 3న మన్నెగూడలో భూమి విషయంలో జరిగిన గొడవలో కన్నారావు పాత్ర కీలకంగా ఉన్నట్టు తెలిసిందన్నారు. ఈ కేసులో నిందితుడైన ధనియాల్ స్టేట్ మెంట్ ద్వారా కన్నారావు పాత్ర ఉందని తేలిందన్నారు. ఆ రోజు జరిగిన విధ్వంసంలో కన్నారావు, అతని అసోసియేట్స్ పాత్ర ఉందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. 

ఇదీ కేసు.. 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడలో సర్వే నంబర్ 32/ఆర్​యూయూలో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్​సంస్థకు చెందిన 2.10 ఎకరాల భూమిని కన్నారావు గ్యాంగ్ కబ్జా చేసిందని ఆ సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నారావు మార్చి 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు, జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్ లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదైందన్న విషయం తెలిసి కన్నారావు పరారయ్యాడు. అప్పటి నుంచి బెంగళూరు, ఢిల్లీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్​అవుట్​నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కావాలని కన్నారావు వేసిన రెండు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు.

నేనే లొంగిపోయా: కన్నారావు

పోలీసులకు తానే స్వయంగా లొంగిపోయానని కన్నారావు తెలిపారు. అరెస్ట్​అయిన తర్వాత ఆదిభట్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సీఐకి ఫోన్​చేసి తాను ఉన్న ఏరియా చెప్పానని పేర్కొన్నారు. మన్నెగూడ భూమిని డెవెలప్ మెంట్ కోసం తీసుకున్నానని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు.