అధికారాన్ని ఇసిరి పారేస్తం

అధికారాన్ని ఇసిరి పారేస్తం

హైదరాబాద్: బీజేపీకి దమ్ముంటే డేట్‌‌ డిక్లేర్‌‌ చెయ్యాలని, తానే అసెంబ్లీ రద్దు చేస్తానని కేసీఆర్‌‌ సవాల్‌‌ చేశారు. ‘‘గీ చిల్లర మాటలతోని కేసీఆర్‌‌ను కొడుతరా.. మేం భయపడం.. కేసీఆర్‌‌కు భయమా.. అధికారం కోసమా.. అధికారాన్ని ఇసిరి పారేస్తం..’’ అని అన్నారు. అవసరమైతే టీఆర్‌‌ఎస్‌‌ జాతీయ పార్టీ అవుతుందని​ చెప్పారు. బీజేపీని ఇప్పటికిప్పుడు పడగొట్టే ఆలోచన తనకు లేదని, వాళ్ల అహంకారం ఇంకా పెరగాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనే వాళ్లను పడగొడుతామని తెలిపారు. ‘‘వారసత్వ పార్టీలను ఎవరు తీసేస్తరు.. ఏదైనా చేస్తే ప్రజలే కదా చేయాల్సింది.. మంత్రి, సీఎం కొడుకో, బిడ్డో అయితే ఒక్కసారి గెలుస్తరు.. పనిచేస్తేనే రెండోసారి ఓట్లేస్తరు.. బీజేపీలో ఎన్ని కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయో లెక్కలేదు’’ అని అన్నారు.

జాతీయ స్థాయిలో ఫ్రంట్‌‌ పెడితే ఇది కిచిడీ సర్కారు ఆరు నెలల్లో పడిపోతది అంటరని, దేశంలోని ప్రజాశక్తినే చైతన్యం చేయడం తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘గాచారం బాగాలేనోడు పది మంది పోతే పోతరు అది పెద్ద ఇష్యూనా.. ఏ ప్రజలకు మేం తక్కువ చేసినం.. అన్ని వేల కోట్ల విలువైన భూములిచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టిచ్చి ఇచ్చినోళ్లు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నరా.. చచ్చినా ప్రజలు టీఆర్‌‌ఎస్‌‌ను వదులుకోరు.. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నరు” అని కేసీఆర్​ పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం ఒక్క ఎకరం పారలే అని ఒకడు అంటడు.. వస్తవా నేను చూపిస్త.. తుంగతుర్తిలో, మెదక్‌‌ జిల్లాలో పారేది కాళేశ్వరం కాదా.. బొట్టుబొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన..’’ అని తెలిపారు. ధరణి పోర్టల్‌‌పై ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఎవడో వస్తే ధరణి తీసేస్తడట వాని బొంద.. రైతుల కోసం తెచ్చినం ధరణి.. 15 నిమిషాల్ల మ్యుటేషన్‌‌ అయిపోతున్నది.  చాలా మంది రైతులు థ్యాంక్‌‌ సీఎం అంటున్నరు’’ అని అన్నారు.