
- 2001లో హైదరాబాద్ మీటింగ్‌కు, 2006లో భద్రాచలం మీటింగ్‌కు శిబూ సోరెన్ హాజరు
హైదరాబాద్ ,వెలుగు: తెలంగాణ ఉద్యమానికి జార్ఖండ్ సీఎం, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ (81) మొదటి నుంచి అండగా నిలిచారు. 2001లో టీఆర్ ఎస్ పార్టీ స్థాపన తర్వాత హైదరాబాద్ లో నిర్వహించిన మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో, జార్ఖండ్ సీఎంగా ఉన్న టైంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై మద్దతుగా మాట్లాడారు. 2006లో భద్రాచలంలో జరిగిన పోలవరం గర్జన సభలో పాల్గొని.. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా ప్రసంగించారు. శిబూ సోరెన్ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు సంతాపం తెలిపారు.
శిబూ సోరెన్ (81) సోమవారం కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘‘మన ప్రియనేత దిషోమ్ గురూజీ మనల్ని విడిచివెళ్లిపోయారు. నాకు సర్వం కోల్పోయినట్టుగా ఉంది’’ అని హేమంత్ సోరెన్ భావోద్వేగానికి గురయ్యారు. జార్ఖండ్ నుంచి శిబూ సోరెన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో శిబూ సోరెన్ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీని స్థాపించారు. తర్వాత జార్ఖండ్‌కు ఆయన 3 సార్లు సీఎంగా పని చేశారు. దుమ్కా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో 3 సార్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2 సార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
1972లో జేఎంఎం ఏర్పాటు
వామపక్ష నేత ఏకే.రాయ్, కుర్మి మహతో వినోద్ బిహారీ మహతోతో కలిసి 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను ఏర్పాటు చేశారు. 1980లో డుమ్కా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి ఎంపీగా తొలిసారి గెలిచారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో కీలక నేతగా ఎదిగారు. ఆ పోరాట ఫలితంగా 2000లో జార్ఖండ్ ఏర్పడింది. 2005లో ఆయన ఫస్ట్ సీఎం అయ్యారు. ఆయన మూడుసార్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిని నిర్వహించలేకపోయారు. 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1974 నాటి కేసు కారణంగా కేంద్ర మంత్రి పదవికి సోరెన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. తన మాజీ కార్యదర్శి హత్య కేసులో దోషిగా తేలడంతో మరోసారి కేంద్రమంత్రి పదవిని కోల్పోయారు. హత్య కేసులో కేంద్రమంత్రి దోషిగా తేలడం అదే తొలిసారి. తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చింది. శిబూ సోరెన్‌కు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది.
కుటుంబ నేపథ్యం
బిహార్‌లోని రామ్‌గఢ్ జిల్లా నేమ్రా గ్రామంలో 1944, జనవరి 11న శిబూ సోరెన్ జన్మించారు. ఆయన సంతాల్ తెగకు చెందినవారు. తండ్రి ఒక స్కూల్లో టీచర్‌గా పని చేసేవారు. వడ్డీ వ్యాపారుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన శిబూ సోరెన్ జీవితంపై ప్రభావితం చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతిలోనే చదువు ఆపేశారు. 18 ఏండ్ల వయస్సులో గిరిజన యువతను సమీకరించేందుకు ‘సంథాల్ నవయువక్ సంఘ్’ను స్థాపించారు. శిబూ సోరెన్ భార్య పేరు రూపీ సోరెన్. ఆయనకు నలుగురు సంతానం. కొడుకులు హేమంత్, బసంత్, దుర్గా సోరెన్, కూతురు అంజలి. 2009లో దుర్గా సోరెన్ చనిపోయారు.
ప్రముఖుల నివాళి
4 నుంచి 6వ తేదీ వరకు సంతాప దినాలు నిర్వహించాల్సిందిగా జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. 4, 5 తేదీల్లో అన్ని ప్రభుత్వ ఆఫీసులు క్లోజ్ ఉంటాయని తెలిపింది. అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శిబూ సోరెన్ మృతిపై పలువురు సంతాపం తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు శిబూ సోరెన్‌కు నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, జైరామ్ రమేశ్, జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా సంతాపం ప్రకటించారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఢిల్లీ సీఎం రేఖా శర్మ, బిహార్ సీఎం నితీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మేఘాలయ సీఎం కాన్రాడ్ కే.సంగ్మా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు నివాళులర్పించారు.
గిరిజన సాధికారత కోసం కృషి: ప్రధాని మోదీ
గిరిజన, పేద, అణగారిన వర్గాల కోసం శిబూ సోరెన్ ఎనలేని కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ప్రజాజీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. శిబూ సోరెన్ భౌతిక కాయానికి మోదీ నివాళులర్పించారు. ఆయన కొడుకు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను పరామర్శించారు. శిబూ సోరెన్ మృతి బాధాకరమని పేర్కొన్నారు.
40 ఏండ్లు ప్రజా సేవ చేశారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శిబూ సోరెన్ 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గిరిజనుల గుర్తింపు కోసం ఆయన ఎంతో పోరాడారు. శిబూ సోరెన్ భౌతికకాయానికి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. జార్ఖండ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని, గ్రామీణ స్థాయిలో ఆయన చేసిన కృషికి జార్ఖండ్ సీఎంగా, కేంద్ర మంత్రిగా, ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.