
- ఆందోళనలకు సీఎం నేతృత్వం
- ధర్నా తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం
హైదరాబాద్, వెలుగు: యాసంగి వడ్లను కేంద్రమే కొనాలంటూ టీఆర్ఎస్ చేస్తున్న ధర్నాల్లో గురువారం పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఐదేళ్ల కింద ఆయనే ఎత్తేసిన ధర్నా చౌకే ఇందుకు వేదికవుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లకే ధర్నా చౌక్‌ను ఎత్తేయడం, ఆ నిర్ణయం చెల్లదంటూ 2018 నవంబర్‌లో హైకోర్టు కొట్టేయడం తెలిసిందే. ధర్నా చౌకే ఉండొద్దన్న కేసీఆర్ ఇప్పుడు ఆందోళన చేయడానికి అక్కడికే పోతుండటంపై చర్చ జరుగుతోంది. బుధవారం మంత్రులు హరీశ్‌రావు, తలసాని, పార్టీ ముఖ్య నేతలు చౌక్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం ఉదయమే సీఎం చౌక్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 దాకా ధర్నా సాగనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడ ర్లంతా పాల్గొంటారు. తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తారు.
బల ప్రదర్శన కాదు: టీఆర్ఎస్
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ధర్నా చేస్తున్నాం తప్ప బల ప్రదర్శన కాదని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. ‘‘అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు టీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. 2014లో ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేసినప్పుడు కూడా మేం తెలంగాణ బంద్ చేసినం. అట్లే ఇప్పుడు రైతుల కోసం ధర్నా చేస్తున్నం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ వడ్లు కొన్నయి. కానీ మోడీ సర్కారు మాత్రం ఆ బాధ్యతల నుంచి తప్పించుకోజూస్తున్నది” అని ఆరోపించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని పంజాబ్ లా రాష్ట్రంలోనూ ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.