లాభాల్లో వాటా పెంపుపై క్లారిటీ ఇవ్వని కేసీఆర్

లాభాల్లో వాటా పెంపుపై క్లారిటీ ఇవ్వని కేసీఆర్

సింగరేణి సంస్థ లాభాల్లో వాటా పెంపుపై కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు అవుతున్నా యాజమాన్యం ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దాంతో వాటా పెంపుపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని కార్మికులు అంటున్నారు. 

సింగరేణి సంస్థ లాభాల్లో వాటా చెల్లింపులో ఆలస్యంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా మే, జూన్ నెలల్లో లాభాల వాటాను ముఖ్యమంత్రి ప్రకటించడం అనవాయితీగా వస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు అవుతున్నా...  ఎంత లాభాలు వచ్చాయన్న విషయం సంస్థ ప్రకటించలేదు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ యాజమాన్యంపై ఒత్తిడి తేవడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. మూడేళ్లుగా లాభాల వాటా చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
‘గత 22 ఏళ్ల నుంచి సింగరేణి సంస్థ లాభాలు పొందుతోంది. దేశంలో ఏ ప్రభుత్వ సంస్థ చెల్లించని విధంగా సింగరేణి పరిశ్రమలోని ఉద్యోగులకు ఇప్పటివరకు 2000 కోట్లను వాటా కింద పంపిణీ చేశారు. 1999-2000లో 10 శాతంతో మొదలైన వాటా గత ఆర్థిక సంవత్సరం 29కి చేరుకుంది. ఈ సారి లాభాల్లో 35 శాతం వాటాను ఇవ్వాలని కార్మిక సంఘాలు అంటున్నాయి’ అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.

సింగరేణి సంస్థ 1999కు ముందు మూతపడే పరిస్థితి ఉండేదని బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి మాధవ నాయక్ అన్నారు. ‘సింగరేణి పరిస్థితి చూసి అప్పటి సీఎం చంద్రబాబు సంస్కరణలు తీసుకొచ్చారు. దీంతో 1999-2000 నుంచి మొదటిసారిగా లాభాల్లో 10 శాతం వాటా కార్మికులకు ఇచ్చారు. అప్పటి నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏటా వాటా శాతం పెంచుతూ వచ్చాయి’ అని ఆయన అన్నారు.

For More News..

అసెంబ్లీలో మైక్ లాక్కొని అయినా మాట్లాడుతాం

దారుణం.. 15 ఏళ్ల అమ్మాయిపై 29 మంది అత్యాచారం

రకుల్, రానాలను కేటీఆరే తప్పించారు