అసెంబ్లీలో మైక్ లాక్కొని అయినా మాట్లాడుతాం

అసెంబ్లీలో మైక్ లాక్కొని అయినా మాట్లాడుతాం

సిరిసిల్ల: శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సమయమివ్వకపోతే మైక్ లాక్కొని అయినా మాట్లాడుతామని దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావు అన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన.. గంభీరావుపేటలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పై వ్యాఖ్యలు చేశారు. 

‘తెలంగాణలో దళితులకు ఇచ్చిన భూములెన్ని? దళితుల నుంచి లాక్కున్న భూములెన్నో అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రం విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలోని మిగిలిన 118 నియోజకవర్గాలకు దళితబంధు ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీపై అసెంబ్లీలో నిలదీస్తాం. వృద్ధులకు ఇచ్చే పింఛన్లు ప్రతి నెలా 23 తేదీ వరకు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రం చేరుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని అసెంబ్లీలో నిలదీస్తాం. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‎కి ప్రజల నుంచి వస్తున్న సమస్యలపై నిలదీసేందుకు అసెంబ్లీని వేదికగా వాడుకుంటాం. దళితబంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్తాం. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వాలి. ఇవ్వక పోతే మైక్ లాక్కొని అయినా మాట్లాడుతాం. అసెంబ్లీలో బీజేపీ పాటించాల్సిన వ్యూహంపై బండి సంజయ్‎తో ఇప్పటికే చర్చించాం’ అని రఘునందన్ రావు అన్నారు.

For More News..

దారుణం.. 15 ఏళ్ల అమ్మాయిపై 29 మంది అత్యాచారం

సిరిసిల్ల మాఫియాకు అడ్డాగా మారుతోంది

రకుల్, రానాలను కేటీఆరే తప్పించారు