12 రోజులు జర భద్రం..కాలనీలలో జనాలు బయటకు రావొద్దు

12 రోజులు జర భద్రం..కాలనీలలో జనాలు బయటకు రావొద్దు

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు నగరాలు, పట్టణాల్లోని కాలనీలను మరింతగా కట్టడి చేయాలని ఆఫీసర్లను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు లాక్​డౌన్​ తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న లాక్​డౌన్ తీరును తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్  శనివారం కొందరు ఆఫీసర్లకు  ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిసింది. రానున్న 12 రోజులు జాగ్రత్తగా ఉంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని, అందుకోసం లాక్ డౌన్​ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు చెప్పాయి.

హైదరాబాద్​ తీరుగానే..!

హైదరాబాద్ పరిధిలో రెండు రోజులుగా దాదాపు వెయ్యి కాలనీలను పోలీసులు దిగ్బంధించారు. కాలనీలో ప్రవేశించే ఎంట్రీలన్నింటినీ క్లోజ్ చేసి, కేవలం ఒక ఎంట్రీని ఓపెన్ చేశారు. అక్కడ కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇతర కాలనీల వాసులను రానివ్వకుండా చూసుకోవాలని కాలనీ అసోసియేషన్లకు పోలీసులు సూచించారు. ఈ ప్రయోగం  సక్సెస్​ అవుతోందని, దీంతో ప్రజలు రోడ్ల మీదికి రావడం తగ్గిందని సీఎం ఆఫీసుకు పోలీసు శాఖ రిపోర్టు ఇచ్చినట్టు  సమాచారం. హైదరాబాద్ లో అమలు చేస్తునట్టుగానే మిగతా నగరాలు, పట్టణాల్లో కూడా కాలనీలను కట్టడి చేయాలని జిల్లాల అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలు టైంలో ఎందుకు వివాదాలు తలెత్తుతున్నాయని ఆరా తీసినట్లు తెలిసింది. స్థానిక నేతలు, అధికారులు చొరవ తీసుకొని రైతులకు పరిస్థితిని అర్థమయ్యేలా వివరించాలని సీఎం సూచించినట్లు సమాచారం.