అందుకే వాళ్లు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు

అందుకే వాళ్లు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు
  • బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​కు రాజ్యాంగంపై ఏ మాత్రం విశ్వాసం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారని ఆరోపించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ రాచరిక వ్యవస్థకు అలవాటుపడ్డారని, 2018లో ఇచ్చిన హామీలను మర్చిపోయి పాలిస్తున్నారని ఫైరయ్యారు. రైతుబంధు పేరుతో రూ.16 వేల కోట్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. దేశ వ్యాప్తంగా మోడీ సర్కార్ రూ.లక్ష కోట్లు రైతులకు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. యూపీలో ఏక కాలంలో రైతు రుణాలను బీజేపీ మాఫీ చేసిందన్నారు. ఇక్కడ కేసీఆర్​ ఆ మాటే ఎత్తడం లేదన్నారు. ఇవేవీ తెలుసుకోకుండా రాష్ట్ర మంత్రులు బావిలో కప్పల్లా అరుస్తున్నారన్నారు. కాంగ్రెస్​ వల్లే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ  రాలేదని, ఇప్పుడు అదే పార్టీతో కలిసి  టీఆర్ఎస్ ధర్నా చేయడం ఏమిటని ప్రశ్నించారు. 
టీఆర్ఎస్ ఎంపీల తీరు సిగ్గుచేటు: డీకే అరుణ 
పార్లమెంట్​లో టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రజా ప్రతినిధులమనే విషయాన్ని ఎంపీలు మర్చిపోయి ప్రవర్తించారన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్  ఆందోళన చేయడాన్ని ఆమె తప్పు బట్టారు. ఈ ఫ్యాక్టరీ రాకపోవడానికి అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను ఉపయోగించుకోవడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.