- చెక్కించిన ముఖాన్ని చెరిపేయాల్సి వచ్చింది
- బీజేపీతో ఘర్షణ పడే శక్తి కేసీఆర్‌కు లేదు
- బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని, విజయ పరంపర నుంచి అపజయాల వైపు ఆయన అడుగులు వేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా టీఆర్ఎస్ భవన్లో జాతీయ జెండాను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎగురవేయించడం బీజేపీ విజయంగా ఆయన అభివర్ణించారు.
ప్రతి ఏడాది మాజీ హోంమంత్రి నాయిని ఎగురవేసే జాతీయ జెండాను ఈసారి కేటీఆర్ ఎగురవేశారంటే బీజేపీ ఒత్తిడికి తలొగ్గినట్లేనన్నారు. బీజేపీతో ఘర్షణ పడే శక్తి లేదని కేసీఆర్ చెప్పకనే చెప్పడం ఆయన బలహీనతను తెలియజేస్తోందన్నారు.
భవిష్యత్తులో కూడా బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందన్నారు. వచ్చే సంవత్సరం కేసీఆర్ జెండా ఎగురవేయడమే కాదు, సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించే పరిస్థితి తెస్తామన్నారు. హరీశ్‌ను పక్కన పెట్టాలనుకున్న కేసీఆర్ ఆ ప్రయత్నంలో ఓడిపోయారని, పార్టీలో ధిక్కార స్వరం వినిపించిన ఈటల, నాయిని, షకీల్, రసమయిలపై చర్యలు లేవంటే అది కేసీఆర్ ఓటమేనన్నారు. యాదాద్రిలో చెక్కించుకున్న తన ముఖాన్ని తానే చెరిపేయించుకోవడం కూడా కేసీఆర్ పతనానికి నాంది అన్నారు.
