- సీఎంపై ఎంపీ కోమటిరెడ్డి ధ్వజం
మద్దూరు, వెలుగు: నాటి అమరవీరుల త్యాగాలను మరచిన సీఎం కేసీఆర్ రజాకార్ లాగే ప్రవర్తిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని వీరబైరాన్ పల్లిలో సెప్టెంబర్ 17న విమోచన దినం సందర్భంగా అమరవీరుల స్మారక స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అమరవీరుల గుర్తుగా తన ఎంపీ నిధులు రూ.19 లక్షలతో కొత్త స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన చేసి బహిరంగ సభలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ తన యాస, అబద్ధపు బాసలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం నా మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేశానని, ఢిల్లీలో ఆందోళన చేసి తెలంగాణ ఇప్పించడంలో సక్సెస్ అయ్యామన్నారు. కేసీఆర్ నిజాంను దేవుడు అంటాడని, ఒక్కసారి వీర బైరాన్‌పల్లి వస్తే నిజాం ఎలాంటివాడో తెలుస్తుందన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన ప్రాంతానికి నీళ్లు, నిధులు వచ్చేంత వరకు పోరాడదామని పిలుపునిచ్చారు. దొరల, గడీల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. అమరవీరుల కుటుంబాలను నా సొంత నిధులతో ఆదుకుంటానని, కేంద్రంతో మాట్లాడి వారికి పెన్షన్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. వీరబైరాన్పల్లి గ్రామానికి ప్రతి సంవత్సరం రూ. 20లక్షల నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తానని తెలిపారు.
