
పెద్లపల్లి,(రామగిరి), వెలుగు: ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం రూ. 80 వేల కోట్లను కొల్లగొట్టింది, వాటిని కేటీఆర్కు చెందిన ఇద్దరు బినామీలకు కట్టబెట్టిండ్రు’ అని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మంథని, రామగిరి మండల కేంద్రాల్లో పర్యటించి మాట్లాడారు. కాళేశ్వరం డబ్బులతో హైదరాబాద్లోని రాయదుర్గం ఏరియాలో కేటీఆర్ మూడెకరాలు కొన్నాడన్నారు. వాళ్ల స్వలాభం కోసమే రూ. 6 వేల కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ కు మెట్రో ఏర్పాటు చేయాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 7200 మంది ప్రజల రక్తం తాగిందని, అందుకే 7200 సింబల్ వాడుతున్నామన్నారు. మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎవరికీ కనబడరన్నారు. ఎమ్మెల్యేలను రీకాల్ చేసే పద్ధతి రావాలన్నారు, అలాగే పని చేయని నాయకుడిని తీసివేసే హక్కు ప్రజలకు ఉండాలన్నారు. ఉచిత విద్య, వైద్యానికి రాబోయే బడ్జెట్లో 40% కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలన్నారు.
తాడిచెర్ల ఓపెన్కాస్ట్లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..
మల్హర్/భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఉద్రిక్తత మధ్య సాగింది. శుక్రవారం గ్రామానికి చేరుకున్న మల్లన్న ముందుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట పేద రైతులను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తర్వాత జెన్కో ఓపెన్ కాస్ట్ మైన్ లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, మల్లన్నకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఒక దశలో తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తర్వాత తాడిచెర్ల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగారు. గ్రామంలోని ప్రజలు, ఓపెన్ కాస్ట్ కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే కేటీకే 5వ గనిపైకి కూడా వెళ్లడానికి మల్లన్న ప్రయత్నించగా సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పర్మిషన్ కోసం జీఎం బళ్లారి శ్రీనివాసరావుకు, సింగరేణి సీఎండీ శ్రీధర్ కు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో కొంతసేపు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా మల్లన్నను అనుమతించాలని ఐఎన్ టీయూసి నాయకులతోపాటు, కార్మికులు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయినా వినకపోవడంతో వెనుదిరిగారు. మల్లన్న మాట్లాడుతూ సింగరేణిలో జరుగుతున్న అవినీతిని బయటపెడతామనే భయంతోనే తమను అనుమతించడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారుల అవినీతిని త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు.