ములుగు, భద్రాచలంలలో చెరో హెలికాప్టర్

ములుగు, భద్రాచలంలలో చెరో హెలికాప్టర్

ములుగు జిల్లా :  వరద ముంపు ప్రాంతాలపై  ఏటూరునాగారంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అటవీశాఖ అధికారులపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.  ములుగు డీఎఫ్ఓ ప్రదీప్ కుమార్ శెట్టిని ఈసందర్భంగా  మందలించారు. ‘‘అటవీ ప్రాంతంలో రోడ్డు వేయనీయం.. బ్రిడ్జి కట్టనీయం..  కరెంట్ పోల్ వేయనీయం అన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదు’’ అని సీఎం కేసీఆర్ సూచించారు. షాపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని డీఎఫ్ఓను  ప్రశ్నించారు. ‘‘రోడ్డు సౌకర్యం లేక..  రేషన్ ఇవ్వలేక..   కలెక్టరు, ప్రజలు చావాలా?’’ అని నిలదీశారు.  ‘‘వెరీ సారీ, మంచి పద్ధతి కాదు’’ అని డీఎఫ్ఓను కేసీఆర్ మందలించారు. అంతకుముందు ఏటూరునాగారం, రామన్నగూడెం పరిధిలోని వరద ముంపు ప్రాంతాలను  సీఎం పరిశీలించారు. ఈసందర్భంగా ఓ గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. రామన్నగూడెం లో ఏటా వరదలు వస్తున్నాయని, వచ్చే ఏడాది వరద సమస్య లేకుండా చూస్తానన్నారు.  రామన్నగూడెం పుష్కర  ఘాట్ ముంపు పై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు వివరించారు .  

మిషన్ భగీరథ పైపులు తక్షణమే మరమ్మతులు చేయాలి

ఏటూరు నాగారం సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్  మాట్లాడిన ముఖ్యాంశాలివీ..  భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.  భారీ వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రతి శాఖ అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సీఎం సూచించారు.  గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని,  ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని నిర్దేశించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్ ను తయారు చేయాలన్నారు. మిషన్ భగీరథ పైపులు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ములుగు జిల్లాకేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున, దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.  వరద తక్షణ సహాయం కింద ములుగు జిల్లాకు రూ.2 కోట్ల 50 లక్షలు, భద్రాచలం జిల్లాకు రూ.2 కోట్ల 30 లక్షలు, భూపాలపల్లి జిల్లాకు రూ.2 కోట్లు, మహబూబాబాద్ కు రూ. 1 కోటి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వర్షాలతో వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగులో ఒక హెలికాప్టర్ ను, భద్రాచలంలో మరొక హెలికాప్టర్ ను సిద్ధంగా ఉంచుతామని వివరించారు.     

పాత బ్రిడ్జిలకు వెంటనే మరమ్మతులు  చేపట్టాలి

‘‘ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్ వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతులు  చేపట్టాలి. విద్యుత్ సౌకర్యాన్ని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నాం. శ్యాంపల్లి ఆర్ అండ్ బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలి. వరద ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదు. నిధులు ఎక్కువ ఖర్చయినా సరే.. నాణ్యమైన పనులు చేపట్టాలి. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి.    అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే పారిశుధ్య పనులను చేపట్టాలి. మనందరం ప్రజల కోసమే పనిచేయాలి. ఏ ఒక్కరినీ ఏమీ అనవద్దు. అటవీశాఖ అధికారులు పనుల ఇబ్బందుల పేరు మీద ఏమాత్రం ఇబ్బంది పెట్టవద్దు’’ అని కేసీఆర్ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. 

ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ ఆదేశాలు

స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్  ఏటూరునాగారానికి ఫైర్ స్టేషన్ మంజూరు చేశారు. తక్షణమే ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా,  సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వరంగల్ కు బయలుదేరి వెళ్లారు. రాత్రి వరంగల్ లోనే బసచేసే అవకాశం ఉంది.