
16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తోంది గులాబీ పార్టీ. ఐతే 6 పార్లమెంటరీ నియోజక వర్గాల్లో పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది TRS. గతంలో ఆ స్థానాల్లో గెలవకపోవడంతో… ఈసారి అక్కడ గులాబీ జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలగా ఉన్నారు కేసీఆర్. ఆ 6 సెగ్మెంట్లలో ప్రచారంతో పాటు అభ్యర్ధుల గెలుపు కోసం గులాబీ బాస్ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
కొన్ని చోట్ల కొత్తవారికి లోక్ సభ టికెట్
పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతోంది. గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై నజర్ పెట్టింది. కొన్ని చోట్ల సిట్టింగులకే సీట్లు ఇవ్వాలని అధినేత కేసీఆర్ డిసైడ్ కాగా…. మరికొన్ని చోట్ల కొత్త అభ్యర్థులకు టిక్కెట్లివ్వాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించని స్థానాల్లో ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు కేసీఆర్. ఆ స్థానాలపై ఫోకస్ పెట్టిన కెసీఆర్…. ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్ధేశం చేస్తున్నారు.
ఆ ఐదు స్థానాలపైనే కేసీఆర్ నజర్
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలవగా… ఒక స్థానంలో టీడీపీ, మరో చోట బీజేపీ, ఖమ్మంలో వైసీపీ గెలిచాయి. ఇక హైదరాబాద్ సీటు మజ్లిస్ చేతిలో ఉంది. మల్కాజ్ గిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మల్లారెడ్డి, వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించిన గుత్తా సుఖేందర్ రెడ్డి కారెక్కారు. ఐనా కూడా పార్టీ గెలవని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ స్థానాలపై ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. చేవెళ్ల పార్ల మెంట్లో టీఆర్ఎస్ గెలిచినా … ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో…. ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యం సాధించినా…. ఖమ్మం జిల్లాలో మాత్రం ఎదురుగాలి వీచింది. దీంతో రాబోయే పార్ల మెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు కేసీఆర్.
ఖమ్మంపై గులాబీ మిషన్ ఆకర్ష్
ఖమ్మం జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం లోక్ సభ పరిధిలోని ఎమ్మెల్యేలను కారెక్కిస్తున్నారు. వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్ ఎప్పుడో కారెక్కారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే సండ్ర, పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గులాబీ పార్టీలో చేరతామని ప్రకటించారు.
నాగర్ కర్నూల్ ఎంపీ సీటు మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. ఈ సీటును కైవసం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు గులాబీ బాస్. ఆ పార్లమెంటరీ పరిధిలోని ఒక్క కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి గెలుపు ఈజీయేనని భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని హితబోధ చేశారు కేసీఆర్.
నల్గొండ పార్లమెంట్ గెలుపు కోసం గులాబీ బాస్ కేసీఆర్ రెండేళ్ల నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి ఎలాగైనా నల్గొండ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు అధినేత. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఒక్క హుజార్ నగర్ మినహా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. అటు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇక్కడ బలమైన అభ్యర్థినే పోటీకి దింపాలని చూస్తున్నారు అధినేత కేసీఆర్.
సికింద్రాబాద్, మల్కాజ్ గిరి స్థానాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్. గతంలో సికింద్రాబాద్ నుంచి తూమ్ భీమ్ సేన్ ను బరిలో నిలపగా ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఈసారి ఎలాగైనా లష్కర్ పై జెండా ఎగురవేయాలని కంకణం కట్టుకున్నారు గులాబీ నేతలు. పార్లమెంటరీ నియోజక వర్గంలోని కీలక ఎమ్మెల్యేలతో పాటు మంత్రి తలసానికి బాధ్యతలు అప్ప గించారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి గత ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ నియోజక వర్గంపై నజర్ పెట్టిన టిఆర్ఎస్…ఈసారి మాత్రం గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఈ నియోజకవర్గ బాధ్యత ను మంత్రి మల్లారెడ్డికి అప్పగించింది గులాబీ అధిష్టానం. మల్లారెడ్డి అన్నీ తానై ఈ పార్లమెంట్ ను గెలిపించుకునేందుకు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటీవల జరిగిన సన్నాహక సమావేశంలోనూ మల్కాజ్ గిరి సీటు విషయంలో నేతలకు కీలక సూచనలు చేశారు.
చేవెళ్ల నియోజకవర్గాన్ని చాలెంజ్ గా తీసుకున్నారు KCR . గత ఎన్నికల్లో ఈ సీటును టీఆర్ఎస్ గెలిచిన్పటికీ…. ఎంపీ కొండా విశ్వేశ్వ ర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. ఈ సీటును గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఆమె కుటుంబానికే సీటు దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. జిల్లాలో మాజీమంత్రి మహేందర్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి కలిసి పనిచేస్తే…. చేవేళ్ల సీటు గులాబీ వశమవుతుందని భావిస్తున్నారు కేసీఆర్.