ఖాయిలా పరిశ్రమలు తెరుస్తలే

V6 Velugu Posted on Oct 14, 2021

  • 100 రోజుల్లో ఓపెన్​ చేపిస్తమని 2014లో కేసీఆర్​ హామీ
  • ఇంతవరకూ అతీగతీ లేదు.. రోడ్డునపడ్డ లక్షల మంది కార్మికులు
  • నిజాం షుగర్స్​​ ఫ్యాక్టరీ లేక ప్రతి సీజన్​లో రైతులకు గోస
  • మూలకుపడ్డ ఆజంజాహీ, ప్రాగా టూల్స్, ఆల్విన్, హెచ్ఎంటీ, ఐడీపీఎల్ మెషీన్లు
  • తెలంగాణ వచ్చిన ఏడున్నరేండ్లలో 13 వేల చిన్న పరిశ్రమలు క్లోజ్​

హైదరాబాద్‌‌, వెలుగు: మూతపడ్డ పరిశ్రమలను తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెరిపిస్తామని ఉద్యమ టైంలో, ఎన్నికల మేనిఫెస్టోలో హామీల మీద హామీలిచ్చిన టీఆర్​ఎస్​.. పవర్​లోకి వచ్చి ఏడున్నరేండ్లయినా పట్టించుకోవడం లేదు. నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్లు, ప్రాగా టూల్స్, ఆల్విన్, హెచ్ఎంటీ, హెచ్‌‌సీఎల్, ఐడీపీఎల్​.. ఇట్లా ఎన్నో పరిశ్రమలు ఖాయిలా పడటంతో ఎందరో కార్మికులు రోడ్డునపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి సుమారు 1,600 వరకు మధ్య తరహా కంపెనీలు, 3 వేల వరకు చిన్న కంపెనీలు మూతపడ్డాయి. రాష్ట్రం వచ్చిన ఈ ఏడున్నరేండ్లలో దాదాపు 13 వేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు క్లోజయ్యాయి. ముఖ్యంగా కరోనా టైంలో సర్కారు నుంచి సాయం లేక, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేక పారిశ్రామిక వేత్తలు వీటిని బంద్​ పెట్టారు. ఏడున్నరేండ్లలో మూతపడ్డ పరిశ్రమల వల్ల సుమారు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

చెప్పుడు మస్తు.. చేసింది లేదు

సీమాంధ్రుల పాలనలో మూతబడిన ప్రాగా టూల్స్‌‌‌‌‌‌‌‌, ఆల్విన్‌‌‌‌‌‌‌‌ కంపెనీ, హెచ్‌‌‌‌‌‌‌‌ఎంటీ, ఐడీపీఎల్‌‌‌‌‌‌‌‌ లాంటి కంపెనీలను పునరుద్ధరించాలని తాము భావిస్తున్నామని, వీటితోపాటు నిజాం షుగర్స్‌‌‌‌‌‌‌‌, ఆజాంజాహీ మిల్లును కూడా తెరిపిస్తామని  2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్​ఎస్​ హామీ ఇచ్చింది. ఉద్యమ సమయంలో , ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో  వీటి గురించే ప్రచారం చేసింది. స్వయంగా కేసీఆర్ అనేక సందర్భాల్లోనూ ఇదే విషయం చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోపు నిజాం షుగర్స్‌‌‌‌‌‌‌‌పై నిర్ణయం తీసుకుంటామని బోధన్ వేదికగా అప్పట్లో ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను మూలకుపడేశారు. ఆయా కంపెనీల కమిటీలు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమాలు చేసినా, సర్కారుకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోతున్నది. సిర్పూర్‌‌‌‌‌‌‌‌ –-కాగజ్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ మిల్లును తప్ప ఏ ఒక్క దాన్ని కూడా రాష్ట్ర సర్కారు తిరిగి తెరిపించలేదు.

తెరిపిస్తే ఎంతో మేలు

మూతపడిన పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలను తెరిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. కార్మికులకు కంపెనీల్లో ఉపాధి దొరుకుతుంది. నిరుద్యోగులకు కొలువులు వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. నిజాం షుగర్స్​ లాంటి పరిశ్రమలను తెరిస్తే రైతులు ఎక్కడికో వెళ్లి చెరుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు. వేసిన పంటకు గిట్టుబాటు వస్తుంది. షుగర్​ ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో ప్రతి సీజన్​లో రైతులు గోసపడుతున్నారు. ప్రైవేటు కంపెనీలకో లేదా సరిహద్దులోని రాష్ట్రాలకో చెరుకును తరలిస్తున్నారు. ఖాయిలా పరిశ్రమలను తెరిపిస్తామన్న టీఆర్​ఎస్​ మాటలు నమ్మితే..  ఫాయిదా లేకుండాపోయిందని రైతులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీ 1936లో ప్రారంభమైంది. దీంతోపాటు మెట్‌‌పల్లి సమీపంలోని ముత్యంపేట, మెదక్ సమీపంలోని ముంభోజిపల్లిలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ యూనిట్లు ఏర్పడ్డాయి. ఇవి 2002 దాకా ప్రభుత్వ రంగంలో నడిచాయి. వీటిలో 2వేల మంది వరకు పనిసేవాళ్లు. టీడీపీ హయాంలో నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీని ప్రైవేట్​కు ఇచ్చారు. ఆ తర్వాత బోధన్​, ముత్యంపేట, మంభోజిపల్లిలోని ఫ్యాక్టరీలు మూతబడ్డాయి.

ఆజంజాహీ మిల్లు

వరంగల్‌‌‌‌‌‌‌‌లో 1934లో 202 ఎకరాల స్థలంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. ఇక్కడ తయారయ్యే బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. సైనికుల డ్రెస్‌‌‌‌‌‌‌‌ మెటీరియల్‌‌‌‌‌‌‌‌ కూడా ఈ మిల్లు ఉత్పత్తులే. వరంగల్‌‌‌‌‌‌‌‌ నగరానికంతటికీ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ లైట్స్‌‌‌‌‌‌‌‌కు కావల్సిన కరెంట్ సరఫరా చేసిన ఘనత ఈ మిల్లుకు ఉంది. ఇందులో సొంతంగా విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి కేంద్రం ఉండేది. 10 వేల మందికిపైగా ఉపాధి పొందేవారు. నిజాం కాలంలో లాభాలతో నడిచిన ఈ మిల్లు.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నష్టాలబాట పట్టింది. 1990లో ఇది మూతపడింది. మిల్లును ఓపెన్​ చేయాలని కార్మికులు ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అనేక మంది పొట్టకూటికోసం వలసవెళ్లిపోయారు. ఇప్పుడు మిల్లు ప్రాంగణంలో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీనిపై కార్మికులు మండిపడుతున్నారు. మిల్లును ఓపెన్​ చేసి తమకు ఉపాధి కల్పించాల్సింది పోయి, కలెక్టరేట్​ను ఏర్పాటు చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.

డీబీఆర్‌‌ మిల్స్

తెలంగాణకు చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ డీబీఆర్‌‌ మిల్స్‌‌. ఇందులో 1922లో ఉత్పత్తి ప్రారంభమైంది. లోయర్‌‌ ట్యాంక్‌‌ బండ్‌‌ వద్ద ఈ ఫ్యాక్టరీ ఉండేది.  ఇందులో వెయ్యి మంది వరకు పనిచేసేవాళ్లు. 1984లో దీన్ని లీజుకు ఇచ్చారు. 1992 ఫిబ్రవరిలో ఫ్యాక్టరీకి తాళం వేశారు. అప్పట్లోనే కోట్ల విలువైన మిషనరీని రాత్రి పూట తరలించుకుపోయారని ప్రచారంలో ఉంది.

ఆల్విన్‌‌‌‌‌‌‌‌ కంపెనీ

1942లో అప్పటి నిజాం పాలనలోని నిజాం పారిశ్రామిక అభివృద్ధి ట్రస్ట్, అల్లావుద్దీన్ అండ్ కంపెనీ సహకారంతో హైదరాబాద్​లో ఆల్విన్ మెటల్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ ప్రారంభమైంది. ఇందులో 15వేల మంది పనిచేసేవారు. 1952లో దేశ తొలి సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను తయారు చేసిన  ఘనత ఈ కంపెనీదే.  ఆర్టీసీకి డబుల్ డెక్కర్ బస్సులను కూడా అల్విన్‌‌‌‌‌‌‌‌ కంపెనీయే తయారు చేసింది. 1981లో జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీని ప్రారంభించారు. 1994లో అల్విన్‌‌‌‌‌‌‌‌ సంస్థ మూతపడింది.

ఐడీపీఎల్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్ బాలానగర్‌‌‌‌‌‌‌‌లో 1961లో ఐడీపీఎల్‌‌‌‌‌‌‌‌ కంపెనీని నాటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. 3,700 మంది పనిసేవాళ్ల. 47 రకాల ఔషధాలను ఇక్కడ తయారు చేసేవాళ్లు. 1996 నుంచి బల్క్‌‌‌‌‌‌‌‌డ్రగ్‌‌‌‌‌‌‌‌, 2003 నుంచి ఫార్ములేషన్ల తయారీ నిలిపివేశారు.

ప్రాగా టూల్స్‌‌‌‌‌‌‌‌

1943 మే నెలలో సికింద్రాబాద్​లోని కవాడీగూడ ప్రాంతంలో ప్రాగా టూల్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌  ప్రారంభమైంది. ఇందులో పరిశ్రమలకు సంబంధించిన టూల్స్​ తయారు చేసేవాళ్లు. 1963లో ఈ పరిశ్రమ పేరును ప్రాగా టూల్స్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌గా మార్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. అనంతరం దీన్ని మూసేశారు.

Tagged KCR, Industries, assurance, , 2014, Telangana Industries

Latest Videos

Subscribe Now

More News